సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం6 గంటలతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులెవరూ ఉండరాదని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన స్థానికేతరులు సాయంత్రం 6 గంటల లోగా వెళ్లిపోవాలని, లేకుంటే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో స్థానికేతరులను గుర్తించడానికి లాడ్జీలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు వంటి ప్రాంతాల్లో పోలీసులతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లను సోమవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
105 సమస్యాత్మక కేంద్రాలు
నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని, మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఈఓ తెలిపారు. అందులో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు. 2,41,795 మంది సాధారణ ఓటర్లతో పాటు 10 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు, 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వివరించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్ రోజున 15 కేంద్ర బలగాలతో పాటు 3,366 మంది రాష్ట్ర పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గం సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా పెట్టామన్నారు. ఇప్పటివరకు రూ.6.8 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 111 బెల్ట్ షాపులను మూసివేయించామని చెప్పారు.
విధుల్లో 1,492 మంది సిబ్బంది
మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభించనున్నారు. మొత్తం ఉప ఎన్నికకు సంబంధించి 1,492 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా మరో 300 మంది అందుబాటులో ఉంటారు. దివ్యాంగ ఓటర్లతో పాటు 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు పోలింగ్ స్టేషన్లలో వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం ప్రకటించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 821 మందిని బైండోవర్ చేయడంతో పాటు వివిధ రకాల కేసులు 40,065 నమోదు చేశారు.
ఈసీకి రాజగోపాల్‌రెడ్డి వివరణ
తన కుటుంబ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి రూ.5.24 కోట్లను మునుగోడులోని కొందరికి బదిలీ చేసినట్టు టీఆర్‌ఎస్ చేసిన ఫిర్యాదుపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణను ఎన్నికల సంఘానికి పంపించామని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. సీఈఓ కార్యాలయంపై రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, ఓ అభ్యర్థి ఎన్నికల గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించిన వ్యవహారంలో తమ కార్యాలయం పాత్ర ఏమీ లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment