నా మాటలు కొందరు శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే. చిన్న మిరుగు (నిప్పురవ్వ) చాలు అంటుకునేందుకు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీకి నేను కలలో కూడా ఊహించని ఆదరణ లభిస్తోంది. రాబోయే రోజుల్లో యూపీ, బిహార్, పశి్చమ బెంగాల్ సహా ప్రతిచోటా ఇదే ఆదరణ వస్తుంది. కేంద్రంలో కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే.. – సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు ఊహించని ఆదరణ వస్తోందని.. రాబోయే రోజుల్లో దేశంలో రాబోయేది తమ రాజ్యమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో తెలంగాణతోపాటు భారత్‌ను సరైన మార్గంలో పెట్టాలని.. దాని కోసం చివరి రక్తపు బొట్టు వరకు రాజీపడకుండా పోరాటం చేస్తానని ప్రకటించారు.
ఏదో ఒరవడిలో, గాలికి కొట్టుకుపోకుండా.. నిజంగా పేదల కోసం పనిచేస్తున్న వారికి అండగా నిలవాలని, మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన మనవడు యశ్వంత్ ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘అంబేడ్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదు. విశ్వమానవుడి విశ్వరూపాన్ని మూర్తి రూపంలో ప్రతిష్టించుకున్నాం. రాష్ట్ర సెక్రటేరియట్‌కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. సెక్రటేరియట్ ముందు అమరుల స్మారకం, అంబేడ్కర్ నమ్మిన బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. సందేశాత్మక అద్భుత చిహా్నలన్నీ ఒకేచోట ఉన్నాయి.
ఇది విగ్రహం కాదు.. విప్లవం..
అంబేడ్కర్ సిద్ధాంతంతో మనసు ప్రభావితం కావాలి. ఆయన మార్గాన్ని అనుసరించడంతో పాటు ఆయన సిద్ధాంతాలు, ఆచరణ అందరి కళ్లలో మెదలాలి. తమ జీవితాలను అర్పించి తెలంగాణ సాధించిన అమరులు కూడా ఆదర్శం కావాలనే ఉద్దేశంతోనే ఈ కాంప్లెక్స్‌కు రూపకల్పన చేశాం. ఆర్థికమంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు ఇది విగ్రహం కాదు.. విప్లవం. కేవలం ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే చైతన్య దీపిక.
ఇది దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుంది: కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భవిష్యత్తు తరాలకు అంబేడ్కర్ స్ఫూర్తిని అందించే లక్ష్యంతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని.. ఈ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ విగ్రహం పాలకులు, అధికారుల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని చెప్పారు. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళితబంధు ద్వారా కేసీఆర్ వెలుగులు నింపారన్నారు.
ఆశయ సాధనకు కార్యాచరణ
దేశంలో 75 ఏళ్లుగా పార్టీలు, ప్రభుత్వాలు మారుతున్నా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు ఇంకా నిరుపేదలుగానే ఉండటం సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలంటే పార్టీ లుకాకుండా ప్రజలు గెలిచే రాజకీయం రావాలని పదే పదే చెప్తున్నాం. ఈ దిశగా దళిత మేధావులు ఆలోచన చేయాలి. ఎక్కడా పెట్టని విధంగా ఈ నెల 30న బీఆర్ అంబేడ్కర్ పేరిట నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నాం.
వీటన్నింటినీ మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తులో భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిది, అంబేడ్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ఆచరణాత్మక కృషి ప్రారంభించాలి. అనేక పారీ్టలు గొడవలు, గందరగోళం సృష్టిస్తున్నాయి. అందువల్ల వాస్తవ దృక్పథంతో దళి తులు ముందుకు సాగేలా కార్యాచరణ కావాలి. ఎవరి వైఖరి ఏమిటి? ఎవరి మార్గం ఏమిటో చూడాలి. బీఆర్‌ఎస్ ఎలా పనిచేస్తుందనేది చూస్తే చాలు. జాతీయ రాజకీయాల్లో మీ ఆశీస్సులు కోరుతున్నా’’అని కేసీఆర్ పేర్కొన్నారు.
అంబేడ్కర్ పేరిట ఏటా అవార్డులు
అంబేడ్కర్ పేరిట ప్రత్యేక అవార్డు ఏర్పాటు చేయాలని కత్తి పద్మారావు పత్రికాముఖంగా సూచన చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఏటా జాతీయ, రాష్ట్రస్థాయిలలో ఉత్తమ సేవలు అందించే వారికి అవార్డులు అందజేస్తాం. దీనికోసం రూ.51 కోట్ల శాశ్వత నిధిని డిపాజిట్ చేయాలని తక్షణమే ఉత్తర్వులు ఇస్తున్నాం. ఈ నిధి ద్వారా ఏటా వచ్చే రూ.3 కోట్ల వడ్డీతో అంబేడ్కర్ పేరు ప్రతిష్టలు శాశ్వతంగా ఉండేలా అవార్డులు ఇస్తాం.
ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు
ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే.. తెలంగాణ తరహాలో దేశంలో ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింప చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 50వేల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపచేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 1.25 లక్షల మందికి దళితబంధు అందుతుంది. బీఆర్‌ఎస్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ దళిత సంక్షేమానికి రూ.16వేల కోట్లు ఖర్చు చేయగా.. మా ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ రిపోర్టులే వెల్లడిస్తున్నాయి.
హెలికాప్టర్‌తో పూలవాన
- అట్టహాసంగా భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం
- బౌద్ధ భిక్షువుల ప్రత్యేక ప్రార్థనలు.. విగ్రహం దిగువన పీఠంలో ఫొటో ఎగ్జిబిషన్
హుస్సేన్‌సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 3.15కు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ 3.30 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు అంబేడ్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ కూడా అక్కడికి వచ్చారు. తొలుత బౌద్ధ భిక్షువులు సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు చేస్తూ వారికి ఆహా్వనం పలికారు.
తర్వాత వారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక మీదుగా అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం పీఠం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌తో అంబేడ్కర్ భారీ విగ్రహంపై గులాబీ రేకులు వెదజల్లారు. తర్వాత అంతా విగ్రహం వేదికపైకి చేరుకుని.. బౌద్ధ భిక్షువులు చేసిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఎగ్జిబిషన్, వీడియోల ప్రదర్శనలు
విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహం దిగువన పీఠంగా ఏర్పాటు చేసిన భవనంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఆత్మబంధువు అంబేడ్కరుడు’వీడియోను వీక్షించారు. తర్వాత అంతా సభా వేదికకు చేరుకున్నారు.
హైదరాబాద్‌లో ‘డిక్కీ’కార్యాలయం ఏర్పాటుకు రెండెకరాలను కేటాయిస్తూ.. సంబంధిత పత్రాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కలసి డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్‌కు అందజేశారు. తర్వాత కేసీఆర్ ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలసి ‘దళితబంధు విజయగాథ’సీడీని ఆవిష్కరించారు. కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్, కొప్పుల ఈశ్వర్ ప్రసంగించగా.. ఎమ్మెల్యే రసమయి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ప్రభు త్వ చీఫ్ విప్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment