గురువారం ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించేవరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్‌ఎస్ పార్టీ తమ పోరాటం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కలిసివచ్చే అన్ని పార్టీలు, సంఘాలతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై తమ పార్టీ ఎంపీలు గట్టిగా కొట్లాడతారని చెప్పినట్టు సమాచారం.
ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాల్సిన ఆవశ్యకతను మరోమారు నొక్కిచెప్పిన సీఎం.. దేశ వ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయాన్ని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ నూతన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేసీఆర్‌తో గురువారం రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌లతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయస్థాయి కూటమి ఏర్పాటు, వ్యవసాయ సమస్యలు, పంటలకు చట్టబద్ధతపై పోరాటం వంటి అంశాలపై చర్చించా రు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవితలు భేటీలో ఉన్నారు. అంతా కలిసి సీఎం నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేశారు.
బీజేపీతో దేశ సమగ్రతకు ముప్పు
పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. సుబ్రహ్మణ్య స్వామితో భేటీలో ప్రధానంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు అంశంపై కేసీఆర్ చర్చించారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌లతో తాను జరిపిన భేటీలు, జేడీయూ, ఆర్జేడీ సహా ఇతర పార్టీల నేతలతో చర్చల వివరాలను ఆయనకు తెలియజేశారు. మతతత్వాన్ని బీజేపీ పెంచి పోషిస్తోందని, దీనివల్ల మున్ముందు దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగినపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అవసరం ఉందని, ఇందుకోసం తన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
రైతు పోరాటాలకు సంపూర్ణ మద్దతు
రైతు సంఘం నేత టికాయత్‌తో జరిగిన భేటీలో ప్రధానంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలు, చట్టాల రద్దు అనంతరం కేంద్రం తీరు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించారు. గత సీజన్‌లో రాష్ట్రంలో పండించిన ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును వివరించారు.
వ్యవసాయానికి ప్రత్యామ్నాయ జాతీయ విధానంపై రైతు సంఘాలు చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రైతు ఉద్యమంలో చనిపోయిన 750 కుటుంబాలకు సంబంధించి తెలంగాణ ప్రకటించిన రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అంశం ప్రస్తావనకు రాగా.. మార్చి 10 తర్వాత ఆయా రైతుల జాబితాను అందజేస్తామని టికాయత్ చెప్పారు.
తెలంగాణ విధానాలు దేశమంతా అమలవ్వాలి
బీకేయూ నేత రాకేశ్ టికాయత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు ప్రోత్సాహక పథకాలు దేశమంతటా అమలు కావాలని బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అనుకూల విధానాలు అమలవుతున్నాయని, రైతు సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నూతన వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. అందులో భాగంగానే తెలంగాణ సీఎంను కలిశా. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుస్తా.
వ్యవసాయ రంగం, రైతాంగ సమస్యలపై హైదరాబాద్‌లో లేదా మరోచోట అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తాం’అని టికాయత్ తెలిపారు. కేసీఆర్‌తో వ్యవసాయ అంశాల గురించి మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయాలపై మాట్లాడలేదని ఆయన తెలిపారు. అయితే రాజకీయాల్లోనూ పోటీ ఉండాలని, పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉందని, అలాంటప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
నేడు జార్ఖండ్‌కు కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ కానున్నారు. రాంచీకి వెళ్లనున్న కేసీఆర్.. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను కూడా అందజేయనున్నారు.
తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబంతో పాటు 19 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని గతంలో సీఎం ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చర్యలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment