రామాయంపేటలో బంద్‌ ప్రశాంతం | Telangana Congress And BJP Leaders Calls For Bandh In Ramayampet | Sakshi
Sakshi News home page

రామాయంపేటలో బంద్‌ ప్రశాంతం

Apr 20 2022 3:37 AM | Updated on Apr 20 2022 3:37 AM

Telangana Congress And BJP Leaders Calls For Bandh In Ramayampet - Sakshi

బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

రామాయంపేట (మెదక్‌)/సాక్షి, కామారెడ్డి: గంగం పద్మ, ఆమె కుమారుడు సంతోష్‌ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయనందుకు నిరసనగా మంగళవారం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. రెండు పార్టీల కార్యకర్తలు పట్టణంలో వేర్వేరుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించడంతో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. 

హోం శాఖ ఏం చేస్తోంది?: జగ్గారెడ్డి
తల్లీకొడుకు ఆత్మహత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని.. డీజీపీ, రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడితే డీజీపీ, హోం శాఖ మంత్రి స్పందించరా’ అని ప్రశ్నించారు. కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయకపోతే బుధవారం రామాయంపేట పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.   

ఇవి ప్రభుత్వ హత్యలే: ఈటల
తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులతో కలిసి రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ హత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అని ఆరోపించారు. సుదీర్ఘమైన అనుభవమున్న డీజీపీ ఐపీసీకి లోబడి పనిచేయట్లేదని, అయన సీఎం దగ్గర గులాంగిరి చేస్తున్నట్టు ప్రజలు భావించే పరిస్థితి వచ్చిందన్నారు.  

దహన సంస్కారాలకు వచ్చిన వాళ్లను బెదిరిస్తున్నారు: కుటుంబీకులు
అధికార పార్టీకి చెందిన నేతలను కేసు నుంచి తప్పించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సంతోష్, పద్మ కుటుంబీకులు ఆరోపించారు. అందుకే పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. కారకులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదని, పదవి నుంచి తొలగించలేదని చెప్పారు. పద్మ భర్త అంజయ్య, కుమారులు శ్రీధర్, శ్రీనివాస్, కూతురు పావని, అల్లుడు తాటికొండ సతీశ్‌కుమార్‌ సాక్షితో మాట్లాడారు.

‘నేతల భయంతో మా సామాజిక వర్గానికి చెందిన సభ్యులు కూడా పరామర్శకు రావడానికి జంకుతున్నారు. దహన సంస్కారం రోజు వచ్చిన వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కొందరు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయం తెలిసినా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు’ అని చెప్పారు. తమను పరామర్శించేందుకు లోకల్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి కూడా రాలేదన్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని కుటుంబీకులు డిమాండ్‌ చేశారు. చైర్మన్లు ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనిపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటన చేయాలని అన్నారు. 

అదుపులో ఆరుగురు
తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అధికార పార్టీకి చెందిన నేతలు నిందితులు కావడంతో పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మంగళవారం రామాయంపేట బంద్‌ పాటించడం, విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రభుత్వ పెద్దలు నష్టనివారణ చర్యలు చేపట్టారు.

వెంటనే నిందితులు లొంగిపోయేలా ఆదేశాలివ్వడంతో వారు సరెండర్‌ అయినట్టు తెలుస్తోంది. నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకురాగా మీడియా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆరుగురిని వేరే ప్రాంతానికి తరలించారు. బుధవారం ఉదయం రిమాండ్‌కు పంపుతామని డీఎస్పీ సోమనాథం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement