No Confirmed Bed-no Entry, Telangana Police Stop Entry Of Covid - 19 Patients - Sakshi
Sakshi News home page

Telangana: సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేసిన పోలీసులు

Published Tue, May 11 2021 8:08 AM | Last Updated on Tue, May 11 2021 12:13 PM

Telangana Cops Stop Covid 9 Patients in Ambulances From Border States - Sakshi

ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ కరోనా బాధితుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను అంబులెన్స్‌ లో తీసుకుని సోమవారం హైదరాబాద్‌ బయలుదేరారు. తెలంగాణలో ఆలంపూర్‌ వద్దకు రాగానే పోలీసులు ఆ అంబులెన్స్‌ ని ఆపి.. రాష్ట్రంలోకి రావడానికి అనుమతి లేదంటూ వెనక్కి వెళ్లమన్నారు. వారు ఎంత బతిమిలాడినా వినలేదు. ఓ ఎమ్మెల్యే ఫోన్‌ చేసినా.. తెలంగాణ పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో బాధితుడు కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

కర్ణాటక నుంచి ఆదివారం అర్ధరాత్రి కరోనా రోగితో వచ్చిన ఓ అంబులెన్స్‌ ను గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్దే పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్‌లో బెడ్లు ఖాళీ లేవని వెనక్కి వెళ్లాలని సూచించారు. తమకు బెడ్‌ అలాట్‌మెంటు ఉందని చూపించినా వెనక్కి పంపించారు. 

సాక్షి, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను తెలంగాణలోకి అనుమతించడంలేదు. రాష్ట్రంలో కరోనా పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పాజిటివ్‌ రోగులను రాష్ట్రంలోకి రానివ్వడంలేదు. అలాంటివారిని తీసుకొస్తున్న అంబులెన్సు లను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడు ్డకుని వెనక్కి పంపిస్తున్నారు. సాధారణ వాహనాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారిని అనుమతిస్తున్నా.. కరోనా బాధి తులను మాత్రం అడుగు పెట్టనివ్వడంలేదు.  

40 శాతం పొరుగు రాష్ట్రాల వారే.. 
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో దాదాపు 40 శాతం మంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్, ఒడిశాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు వారికి ఎలాంటి షరతులూ లేకుండా చికిత్స అందించిన ప్రభుత్వం.. ఆదివారం రాత్రి నుంచి అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను రాష్ట్రంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ–ఆంధ్రా సరిహద్దులైన వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజాలతోపాటు ఏపీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించే మాచర్ల మార్గంలో నాగార్జున సాగర్‌ వద్ద, దాచేపల్లి మార్గంలో వాడపల్లి వద్ద, మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన వద్ద, హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం రామాపురం వద్ద  ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ.. కోవిడ్‌ రోగులున్న అంబులెన్సులను వెనక్కి పంపిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్‌ ఉన్నట్టు పత్రాలు చూపించినవారిని మాత్రం రాష్ట్రంలోకి అనుమతించారు. ఈ విషయంపై ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌ గఢ్, మహారాష్ట్ర ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించిన కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. వీరంతా ఆక్సిజన్‌ సిలిండర్లతో లైఫ్‌ సపోర్ట్‌ వచ్చిన వారే కావడం గమనార్హం.

ఏపీ నుంచే బాధితులు అధికం.. 
తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్‌ కంటే ఏపీ నుంచే రోగుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే ఆ అంబులెన్సులను ఆపడంతో చాలావరకు అక్కడే నిలిచిపోయాయి. రోగి కేస్‌షీట్‌ చూసి కరోనా పాజిటివ్‌ అయితే వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్‌ అలాట్‌మెంట్‌ చూపిస్తే అనుమతించినా.. మరికొన్ని చోట్ల అంగీకరించలేదు. ఎందుకు ఆపుతున్నారన్న ప్రశ్నకు హైదరాబాద్‌లో బెడ్లు లేవని, ఆక్సిజన్‌ కొరత ఉందని అందుకే ఆపమంటూ తమకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని పలువురు కిందిస్థాయి పోలీసులు తెలిపారు. దీంతో చాలామంది తెల్లవారుజాము వరకు ఎదురుచూసి వెనక్కి వెళ్లిపోయారు.

ఇక కర్ణాటక, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఉండటంతో అక్కడ నుంచి వచ్చే రోగుల సంఖ్య పెద్దగా లేదు. అందుకే, ఈ విషయంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ పోలీసులు తామెవరినీ ఆపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని ఉమ్మడి ఆదిలాబాద్‌ పోలీసులు తెలిపారు. అయితే, రాష్ట్రంలోకి ప్రవేశించే వారు ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం నోట్‌ చేసుకుని అనుమతిస్తున్నామని వెల్లడించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏపీ మీదుగా భద్రాచలం ద్వారా రావాలనుకున్న కరోనా పేషెంట్లకు ఎంట్రీ లేదనే చెబుతున్నారు. 

మానవత్వంతో చూడండి: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను 
ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలగాంణలోకి అనుమతించకపోవడంపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడారు. కోవిడ్‌ బాధితులపై మానవత్వం చూపాలని కోరారు. అంబులెన్సులను నిలిపివేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగా ణ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement