తెలంగాణ: టెన్త్‌ పరీక్షలు అవసరమా? | Telangana: As COVID19 Returns, Will 10 Exams Get Cancelled?  | Sakshi
Sakshi News home page

తెలంగాణ: టెన్త్‌ పరీక్షలు అవసరమా?

Published Sat, Apr 10 2021 2:07 AM | Last Updated on Sat, Apr 10 2021 10:57 AM

Telangana: As COVID19 Returns, Will 10 Exams Get Cancelled?  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరో వారం పది రోజులు వేచి చూసి... తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పటివరకు కేసుల పెరుగుదల పరిస్థితిని చూసి ముందుకు సాగితే బాగుంటుందన్న యోచనలో ఉన్నారు. మే 17వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న భావనలోనే ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. గతేడాదిలాగే పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేసి పాస్‌ చేయాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం.

గతేడాది ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్స్‌ (ఎఫ్‌ఏ) పరీక్షలు, ఒక సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష జరిగాయి. వాటితోపాటు ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించి పాస్‌ చేశారు. అయితే ఈసారి అవేవీ జరుగలేదు. ఒకే ఒక ఎఫ్‌ఏ పరీక్షను కొన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో అధికారులు వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నారు. మే నెల మొదటివారం వరకు కరోనా వ్యాప్తిని పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని, కేసులు తగ్గితే కనుక పరీక్షలు నిర్వహించాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. కేసుల వ్యాప్తి తగ్గకపోతే మాత్రం పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇక ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.  

ఫస్టియర్‌ పరీక్షలపై అస్పష్టత 
ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థుల విషయంలోనూ ఆలోచన చేస్తున్నారు. కేసులు తగ్గితే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. లేదంటే మాత్రం కనీస మార్కులతో పాస్‌ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో కనీస పాస్‌ మార్కులతో విద్యార్థులను ఉత్తీర్ణులను చేశారు. ఈసారి కూడా అలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మాత్రం మే 1వ తేదీ నుంచి పరీక్షలు యథావిధిగా ఉంటాయని శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు.

పరీక్షల రద్దు విషయంలో తామేమీ ఆలోచన చేయడం లేదని, దానిపై ఏమైనా ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని పేర్కొన్నారు. మరోవైపు ద్వితీయ సంవత్సర విద్యార్థుల విషయంలో మాత్రం పరీక్షలు ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ప్రభు త్వం ఉన్నట్లు తెలిసింది. ఉన్నత విద్యకు వెళ్లే, ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోతే సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అయితే షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిం చాలా? లేదంటే కొన్నాళ్లు వాయిదా వేసి నిర్వహించాలా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై మరో నాలుగైదు రోజుల్లో ఉన్నతస్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 

చదవండి: (టెస్టులు లక్ష.. టీకాలు లక్ష)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement