జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి నుంచి లొత్తునూరు వైపు వెళ్లే మార్గంలో రహదారి పరిస్థితి ఇదీ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దూలపల్లి నుంచి జీడిమెట్లకు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి ఇది. పారిశ్రామిక వ్యర్థాలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. నిత్యం 5 వేలకుపైనే లారీలు, అంతకు పదింతలుపైనే ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డు చాలాచోట్ల గుంతల మయంగా మారింది. ఓవర్ లోడ్ వాహనాల కారణంగా.. కొత్తగా వేసిన మూడేళ్లలోనే ఈ స్థితికి చేరుకుందని స్థానికులు వాపోతున్నారు.
నాసిరకం రోడ్లతో...
►సాధారణంగా సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్లు వేగాన్ని సరిగా అదుపు చేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పటిష్టమైన రోడ్లపైనే వాహనాలు అదుపుతప్పుతుంటే.. నాసిరకం రోడ్లపై మరింతగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకట్రెండు వర్షాలకే పెచ్చులూడే రోడ్లపై అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది.
►రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతుల సమయంలో నాసిరకం సామగ్రిని వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పైగా హడావుడిగా నిర్మాణంతో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో తారువేసే సమయంలో అది కనీసం 100 డిగ్రీల నుంచి 120 డిగ్రీల (లేయింగ్ టెంపరేచర్) సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కానీ దూరంలో ఎక్కడో తయారుచేసి, ఓపెన్ ట్రక్కుల్లో తరలిస్తున్న తారు 90డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంటోందని.. దానిని అలాగే పరిచి, రోలింగ్ చేస్తున్నారని అంటున్నారు.
ఇక తారు నాణ్యత (బిటుమినస్ తార్) 4.5 శాతం నుంచి 5 శాతం వరకు ఉండాలని.. కానీ 3.5 శాతం నుంచి 4 శాతం వరకే ఉంటోందని పేర్కొంటున్నారు. ఇలాంటి తారును రోడ్డు రోలర్లతో తొక్కించడం వల్ల మొదట్లో బాగానే కనిపించినా.. కొద్దిరోజులకే దెబ్బతింటోందని స్పష్టం చేస్తున్నారు. చిన్నవానలకే రోడ్లకు పగుళ్లురావడం, పైపొర కొట్టుకుపోవడం వంటివి జరుగుతున్నాయని.. అలాంటి రోడ్లపై ఓవర్‌లోడ్ వాహనాలు తిరుగుతుండటంతో మరింత నష్టం కలుగుతోందని వివరిస్తున్నారు.
ఓవర్ లోడ్‌తో వెళితే..
►రహదారులపై వాహనాల బరువుతో పడే ఒత్తిడిని కిలోన్యూటన్ల (కిలోన్యూటన్ అంటే సుమారు 101 కిలోల బరువు)లో కొలుస్తారు. ఆయా రోడ్ల నిర్మాణ తీరు (అక్కడి నేల తీరు, వాడిన కంకర పరిమాణం, రోలింగ్, తారు (బిటుమినస్ తార్) నాణ్యత తదితర అంశాల)ను బట్టి అవి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. గ్రామాల మధ్య నిర్మించే సాధారణ రోడ్ల సామర్థ్యానికి, భారీ హైవేల సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది.
►రోడ్లను నాసిరకంగా తక్కువ సామర్థ్యంతో నిర్మించినా, తక్కువ కెపాసిటీ ఉన్నరోడ్లపై పరిమితికి మించి ఓవర్‌లోడ్ వాహనాలు వెళ్లినా.. సదరు రోడ్లు దెబ్బతింటాయి.
►రాష్ట్రంలో 30 కిలోన్యూటన్ల సామర్థ్యానికి అనుగుణంగా రూపొందించిన రహదారులపై కూడా 60 కిలోన్యూటన్ల ఒత్తిడిపడే భారీ ఓవర్‌లోడ్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు, ఇటీవల నిర్మించిన కొన్ని హైవేలు మినహా.. మిగతా రోడ్లన్నీ 40కిలోన్యూటన్లలోపు సామర్థ్యమున్న రోడ్లే కావడం గమనార్హం. ఇలాంటి ఈ రోడ్లపై ఇసుక, ఇటుక, కంకర, ఐరన్, గ్రానైట్స్, మార్బుల్స్ వంటి సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నారు.
►ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లపై ఒత్తిడి పెరగడం, ఆ వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే తీవ్ర వైబ్రేషన్ (ప్రకంపనాల)తో రోడ్ల బేస్ దెబ్బతింటుంది. పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆ పగుళ్లు, రంధ్రాల్లోకి వాన నీరు, గాలిచేరి రోడ్డు బలాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని రహదారి భద్రతా నిపుణులు చెప్తున్నారు. ఇలా కొద్దిగా దెబ్బతిన్న రోడ్లు వాహనాల రాకపోకలు జరిగిన కొద్దీ మరింతగా పాడైపోయి.. పెద్ద పెద్ద గుంతలు పడతాయని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, నగర శివారు రహదారులు, లోపలి రోడ్లు కూడా ఇలా ఓవర్‌లోడ్ వాహనాల వల్ల దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. ఇది రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదమేంటి?
నాణ్యమైన రోడ్లు కనీసం ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయని, మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లపాటు వినియోగించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రెండు, మూడేళ్లకే మరమ్మతులు చేసినా దెబ్బతింటున్నాయి.
►ఓవర్‌లోడ్ కారణంగా డ్రైవర్లు వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఓవర్‌లోడ్, రోడ్లపై గుంతలు కలిసి వాహనాల టైర్లు పేలిపోయి ఇతర వాహనాలను ఢీకొట్టడం, బోల్తాపడటానికి కారణమవుతున్నాయి.
►రోడ్లపై తారు కొట్టుకుపోవడం, కంకర తేలడం, గుంతలు పడటం కారణంగా సాధారణ వాహనాలు కూడా అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి.
పగిడిపాల ఆంజనేయులు
ఓవర్‌లోడ్ వాహనాలు రహదారి భద్రతకు పెనుముప్పుగా మారాయి. పరిమితికి మించిన బరువుతో పరుగులు తీస్తున్న సరుకు రవాణా లారీలు, ప్రైవేట్ బస్సుల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రధాన రహదారులపై పరిస్థితిని గమనించింది. నిత్యం వేలకొద్దీ లారీల్లో ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్, ఐరన్, మార్బుల్స్ తదితర సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నట్టు గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం..
వరంగల్ నుంచి వర్ధన్నపేట మీదుగా తొర్రూరు, మహబూబాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఇది. నిత్యం ఆర్టీసీ బస్సులు, మైనింగ్ లారీలు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్లే మైనింగ్ లారీల కారణంగా రోడ్డు చాలా చోట్ల దెబ్బతిన్నది. దీనితో సాధారణ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇది మహబూబ్‌నగర్ –చించొల్లి అంతరాష్ట్ర రహదారి దుస్థితి. ప్రస్తుతం రోడ్డు సామర్థ్యం 20 టన్నుల బరువులోపే. కానీ 30 టన్నులకుపైగా బరువుతో రోజూ వందలాది లారీలు ప్రయాణిస్తున్నాయి. దీనికితోడు రోడ్డు నాణ్యతా లోపం కారణంగా.. అడుగుకో గుంత అన్నట్టుగా తయారైంది.
రోడ్ల సామర్థ్యం కాస్త పెరిగినా..
ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ జరిగింది. సామర్థ్యం ఎక్కువగా ఉండే నాలుగులైన్ల రహదారులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ఉన్న నిబంధనలను సవరించిన రవాణాశాఖ.. టైర్ల సంఖ్యకు అనుగుణంగా సుమారు 3 టన్నుల చొప్పున వాహనాల రవాణా బరువు పరిమితిని పెంచారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓవర్‌లోడ్ రవాణాకు ఇది ఏమాత్రం దగ్గరగా లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకించి ఇసుక, కంకర, ఐరన్, గ్రానైట్ వంటి సామగ్రిని రవాణా చేస్తున్న వాహనాలు యథేచ్చగా లోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు.
►ఒకవైపు రాజకీయ నాయకుల జోక్యం, మరోవైపు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిన్నర కాలంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలను నిలిపివేశారు. దీంతో బాహాటంగానే ఓవర్‌లోడ్ సరుకు రవాణా సాగుతోంది.
►ఓవర్‌లోడ్, రోడ్లు దెబ్బతినడంపై రవాణా శాఖ ఉన్నతాధికారులను సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా.. వారి నుంచి స్పందన రాలేదు.
నిబంధనలు ఏమిటి?
►రవాణాశాఖ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల లారీల్లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే తీసుకెళ్లాలి. కానీ 35 టన్నుల వరకు తరలిస్తున్నారు.
►12 టైర్ల వాహనాల్లో 32 టన్నుల వరకు అనుమతి ఉంటుంది. అయినా 45 టన్నుల వరకు ఇసుక, ఐరన్, గ్రానైట్ వంటివి రవాణా చేస్తున్నారు.
►6 టైర్ల సాధారణ లారీల్లో 18 టన్నుల వరకు బరువును తీసుకెళ్లవచ్చు. కానీ వాటిలో 25 టన్నుల వరకు వివిధ రకాల వస్తువులను రవాణా చేస్తున్నారు.
►హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్, మియాపూర్, బొల్లారం, నాచారం, చర్లపల్లి, ఉప్పల్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వివిధ రకాల రవాణా వాహనాలు, వ్యర్ధాల తరలింపు లారీలు పరిమితికి మించిన లోడ్‌తో రహదారి భద్రతకు సవాల్‌గా మారుతున్నాయి.
►చాలా వాహనాల్లో పరిమితికి మించి 10 నుంచి 20 టన్నుల మేర ఎక్కువ బరువును రవాణా చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రహదారిలో సుచిత్ర ప్రాంతం వద్ద రోడ్డు దుస్థితి ఇది. కనీసం 10 ఏళ్లు ఉండాల్సిన రోడ్డు.. వేసిన రెండు, మూడేళ్లకే చాలా చోట్ల గుంతలు పడి, తారు కొట్టుకుపోయి దెబ్బతిన్నదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్లు ఇలా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇసుక అక్రమ రవాణాతోనూ..
తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు ఇసుక పెద్ద ఎత్తున రవాణా అవుతుంది. రోజూ కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 వేల లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. కేవలం 18 టన్నుల సామర్ధ్యం ఉండే ఆ లారీల్లో 25 టన్నులకుపైగా ఇసుకను నింపి రవాణా చేస్తున్నారు. రోజూ రాత్రిళ్లు వేలాది లారీలు వేగంగా రహదారులపై ప్రయాణిస్తున్నాయి. ఉప్పల్, అల్వాల్, తిరుమలగిరి, కర్మన్‌ఘాట్, చంపాపేట్, కూకట్‌పల్లి తదితర అడ్డాలకు.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలకు ఇసుక రవాణా చేస్తున్నాయి. ఇలా ఓవర్‌లోడ్ తరలింపును అరికట్టడంలో రవాణాశాఖ విఫలమవుతోంది. కొందరు అధికారులు, సిబ్బంది లారీ యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బస్సులా?.. సరుకు రవాణా వాహనాలా..?
ప్రైవేటు బస్సులు చాలా వరకు సరుకు రవాణా వాహనాలుగా కూడా మారిపోతున్నాయి. లగేజీ బాక్సులతోపాటు బస్సుల టాప్‌పై కూడా సరుకులను నింపి రవాణా చేస్తున్నారు. ఓవైపు ప్రయాణికులు, వారి లగేజీకి తోడు అదనంగా సరుకులతో బస్సులు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, బెంగళూర్ తదితర ప్రాంతాలకు బట్టలు, ఐరన్, ద్విచక్ర వాహనాలు వంటివాటిని బస్సుల్లో తరలిస్తున్నారు.
గతంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, బహదూర్‌పురా, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో.. బస్సుల్లో తరలిస్తున్న ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను గుర్తించడం గమనార్హం. ఇప్పటికీ కూకట్‌పల్లి, మియాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ప్రైవేట్ బస్సుల్లో క్వింటాళ్ల కొద్దీ సరుకు రవాణా జరుగుతూనే ఉంది.
ఓవర్‌లోడ్‌తో రోడ్లకు పగుళ్లు
ఇటీవల కాలంలో పలుచోట్ల రోడ్ల సామర్థ్యాన్ని పెంచారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. లక్ష టన్నుల బరువు మోయాల్సినరోడ్డుపై ఏకంగా కోట్ల టన్నుల బరువు మోపితే ఎలా ఉంటుంది? ఓవర్‌లోడ్ కారణంగా రోడ్ల బేస్‌మెంట్ నుంచి పగుళ్లు వచ్చి దెబ్బతింటాయి. అంతిమంగా రహదారి భద్రతకు ఇది ముప్పు.
– ప్రొఫెసర్ గోపాల్‌నాయక్, రోడ్డు నిర్మాణ నిపుణుడు
వాహనాలను నియంత్రించలేక ప్రమాదాలు
ఓవర్‌లోడ్ వల్ల డ్రైవర్లు వాహనాలను నియంత్రించలేక పోతున్నారు. ప్రమాదాలను నివారించే అవకాశమున్న సందర్భాల్లో కూడా.. ఓవర్‌లోడ్ వల్ల వాహనాలను అదుపు చేయలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు డివైడర్లను ఢీకొంటున్న సంఘటనల్లో చాలా వరకు ఓవర్‌లోడే ప్రధాన కారణం.
– సి.రామచంద్రయ్య, రహదారి భద్రత నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment