సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనం కనిపించని పరిస్థితి. రోడ్డు నిర్మాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి పట్టింపు లేకపోవడంతో దుమ్ము లేస్తోంది. దీంతో వాహనదారులతో పాటు నడుస్తూ వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్లు కూడా చల్లని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
నీళ్లు చల్లడం లేదు..
మండలంలోని చెరువుమాదారం క్రాస్‌రోడ్డు నుంచి బౌద్ధక్షేత్రం వరకు ఉన్న రహదారిలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ప్రభుత్వం నాలుగు లైన్ల రహదారిని మంజూరు చేసింది. రూ.17 కోట్లతో రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కాగా నేలకొండపల్లిలో రహదారి నిర్మాణ పనుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కనీస జాగ్రత్తలు మరిచిపోయారని ప్రజలు మండిపడుతున్నారు. కంకరపోసిన రహదారిపై వాహనాలు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎండల తీవ్రత వలన రహదారిపై ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొట్టించాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ అడపాదడపా నీళ్లు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటీవల ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. తృటిలో ప్రమాదం తప్పింది. అనేక వాహనాలు పల్టీకొట్టిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, కాంట్రాక్టర్ దుమ్ము లేవకుండా నిత్యం నీరు చల్లించేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment