
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు, సీనియర్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్‌కు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమించేందుకు జాతీయ నాయకత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ పక్షాన ఈటల ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను తీసుకెళ్లి కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలకు చెక్ పెట్టవచ్చని, పార్టీకి మంచి ఫలి తాలు రాబట్టవచ్చనే అభిప్రాయంతో నాయకత్వం ఉన్నట్లు సమాచారం. మళ్లీ తెలంగాణ సెంటిమెం ట్‌ను కేసీఆర్ తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఇవ్వకుండా ఈటల అస్త్రాన్ని ప్రయోగించాలనే ఆలోచనతో జాతీయ నాయక త్వం ఉన్నట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీ బలం, కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, అవినీతిరహిత సుపరిపాలన వంటివి తోడైతే ఇక తిరుగుండదని గట్టిగా నమ్ముతున్నట్టు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ రాజకీయాలు, జిల్లాల్లో ఆ పార్టీలోని వివిధ వర్గా లు, కులాలవారీగా సమీకరణలు, సమస్యలు వంటివాటిపై ఈటలకున్న లోతైన అవగాహన పార్టీ గెలుపునకు ఉపయోగపడతుందని నేతలు భావిస్తున్నారు.
ఆదివారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆహ్వానం మేరకు ఈటల ఢిల్లీ వెళ్లి సమావేశమైన నేపథ్యంలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. వచ్చేనెల 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గభేటీకి ముందు లేదా ఆ తర్వాత ఈటల నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.