సాక్షి, ఖమ్మం: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇన్నాళ్లూ విదేశాల నుంచి వచ్చినవారిలోనే వైరన్ ను గుర్తించగా, ఇప్పుడు ప్రైమరీ కాంటాక్టులు సైతం ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలోనే తెలంగాణ 44 పాజిటివ్ కేసులతో మూడో స్థానంలో ఉంది. వీరిలో 10 మంది కోలుకోగా, ప్రస్తుతం తెలంగాణలో 34 ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా ఖమ్మం జిల్లాలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది. పట్టణంలోని వైరారోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే 21ఏళ్ళ యువతికి ఓమిక్రాన్ నిర్దారణ అయ్యింది. ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మంలో తన ఇంటికి వచ్చిన యువతికి జలుబు, దగ్గు ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేసుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఒమిక్రాన్ లక్షణాలు కూడా కనిపించడంతో హైదరాబాద్ వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపగా ఒమిక్రాన్ అని తేలింది. వెంటనే యువతిని అధికారులు హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు.
కాగా ఖమ్మం యువతితో కలిపి తెలంగాణలో ఇవాళ కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44 కి పెరిగింది. కొత్తగా నమోదైన మూడు కేసుల్లో రెండు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులు కాగా, ఒకటి ఒమిక్రాన్ పేషేంట్ కాంటాక్ట్‌కు చెందినది. ఇటీవల ఒక విదేశీయుడి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌కు ఒమిక్రాన్ సోకగా ఆదివారం ఫలితాల్లో ఆ వైద్యుడి భార్యకూ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొదటిసారి ఒమిక్రాన్ రెండో కాంటాక్ట్‌కు కూడా వ్యాపించినట్లు తేలింది. ఇది ప్రమాదకరమైన పరిణామమని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment