బీఆర్‌ఎస్‌ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా | Telangana Formation Day Celebration Today Start In Hyderabad, Says KCR | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా

Published Sat, Jun 1 2024 4:22 AM | Last Updated on Sat, Jun 1 2024 4:43 PM

telangana formation day celebration today start: KCR

నేటి నుంచి ‘తెలంగాణ అవతరణ ఉత్సవాలు’

ఏర్పాట్లపై నందినగర్‌ నివాసంలో అధినేత కేసీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారత్‌ రాష్ట్ర సమితి సన్నాహాలు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు. గతేడాది ప్రభుత్వపరంగా దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకలను జరిపిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ పరంగా ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్‌ పాత్రకు అద్దం పట్టేలా వేడుకల నిర్వహణకు పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా కేసీఆర్‌ శుక్రవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌లోని నందినగర్‌ నివాసానికి చేరుకున్నారు. కార్యక్రమాలకు సన్నాహాలపై పార్టీ నేతలతో సమీక్షించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఏర్పాట్ల తీరుతెన్నులను ఆయనకు వివరించారు.  

నేడు ర్యాలీ ప్రారంభించనున్న కేసీఆర్‌ 
 ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో పాటు, జిల్లాల నుంచి కూడా నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పబ్లిక్‌ గార్డెన్స్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు కేసీఆర్‌ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళి అరి్పస్తారు. అనంతరం గన్‌పార్కు నుంచి క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభిస్తారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, ఇతర తెలంగాణ కళారూపాలతో వేయి మందికి పైగా కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొంటారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుతో పాటు పార్టీ కీలక నేతలు ఈ ర్యాలీకి నేతృత్వం వహిస్తారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన న్యాయవాదులు, డాక్టర్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా పాల్గొంటారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్‌ కాలునొప్పి ఉన్నందున ఊరేగింపు ప్రారంభ కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారు.

రవీంద్రభారతి, రిజర్వు బ్యాంకు కార్యాలయం మీదుగా సాగే ఈ ర్యాలీ ట్యాంకుబండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమరజ్యోతి వద్దకు చేరుకుంటుంది. అక్కడ జరిగే ముగింపు కార్యక్రమంలో వందలాది మంది కవి గాయకులు అమరులకు నివాళి అరి్పస్తూ బృందగానం చేస్తారు. 

రేపు తెలంగాణ భవన్‌లో జెండాల ఆవిష్కరణ 
 ఉత్సవాల రెండో రోజు ఆదివారం బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2వ తేదీ ఉదయం 9 గంటలకు కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేస్తారు. 9.30కు తెలంగాణ భవన్‌ సమావేశ మందిరంలో ‘తెలంగాణ యాది’పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను అమరుల కుటుంబాల చేతుల మీదుగా ప్రారంభిస్తారు.

అనంతరం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో నాయకులు, కార్యకర్తలతో జరిగే సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి వచ్చే నాయకులు, కేడర్‌ కోసం మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉత్సవాల చివరి రోజు 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలు మినీ తెలంగాణ భవన్లలో పార్టీ జిల్లా అధ్యక్షులు జాతీయ పతాకం, పార్టీ జెండాను ఎగురవేస్తారు. స్థానికంగా పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement