జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్థానంలో నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై మళ్లీ విచారణ
ఏపీ, గౌహతి హైకోర్టుల సీజేగా, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ లోకూర్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్థానంలో ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమరి్పంచడానికి ప్రభుత్వం జస్టిస్ లోకూర్‌కు 3 నెలల గడువును విధించింది.
జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గౌహతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. కాగా, నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్ సంస్థకు అప్పగించడంతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడంపై పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ మూడు నిర్ణయాల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై విచారణ జరిపి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నిర్ధారించాలని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పుడు ఇదే మార్గదర్శకాలు జస్టిస్ లోకూర్ కమిషన్‌కు కూడా వరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాల్లో పాత్ర ఉన్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఇంధన శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులకు జస్టిస్ నరసింహా రెడ్డి గతంలో నోటీసులు జారీ చేసి వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని స్వీకరించారు.
విచారణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసి నివేదికను సైతం రూపొందించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ సందర్భంలో జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వాŠయ్‌ఖ్యలను కారణంగా చూపుతూ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, జూలై 1న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచి్చంది.
హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని ఈ నెల 16న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను నియమించడంతో విద్యుత్ నిర్ణయాలపై విచారణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment