సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో కోవిడ్ మార్గదర్శకాల అమలులో భాగంగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ శాసనసభ ఉపఎన్నికలకు అమలు చేసిన ఎన్నికల కోడ్ నిబంధనలే స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తాయన్నారు.
రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రచార సభల్లో 500 మందికి, వీధి సమావేశాల్లో 50 మందికి మించి అనుమతి ఉండదని చెప్పారు.
రోడ్‌షోలకు అనుమతి లేదని, పాదయాత్ర, ఇతర ర్యాలీలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఊరేగింపులకు అనుమతి లేదని, అభ్యర్థులతో పాటు రెండు వాహనాలు, ఇద్దరు/ముగ్గురు వ్యక్తులకు మాత్రమే నామినేషన్ కేంద్రం వద్ద అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లు, ఎలక్షన్‌సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్‌పూర్తై ఉండాలని పేర్కొన్నారు.
9,835 మంది ఓటర్లు
బ్యాలెట్ ద్వారా ప్రాధాన్యత ఓటు పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయని శశాంక్ గోయల్ తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. మొత్తం 12 స్థానాల్లో 9,835 మంది ఓటర్లు ఉన్నట్లు శశాంక్ గోయల్ తెలిపారు. ఆదిలాబాద్‌లో 931, వరంగల్ 1,021, నల్లగొండ 1,271, మెదక్ 1,015, నిజామాబాద్ 809, ఖమ్మం 769, కరీంనగర్ 1,323, మహబూబ్‌నగర్ 1,394, రంగారెడ్డిలో 1,302 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన చేస్తున్నామని, పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నా, గుర్తులకు బదులు అభ్యర్థుల ఫొటోలు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment