Local Company
-
బహిరంగ సభలకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో కోవిడ్ మార్గదర్శకాల అమలులో భాగంగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ శాసనసభ ఉపఎన్నికలకు అమలు చేసిన ఎన్నికల కోడ్ నిబంధనలే స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తాయన్నారు. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రచార సభల్లో 500 మందికి, వీధి సమావేశాల్లో 50 మందికి మించి అనుమతి ఉండదని చెప్పారు. రోడ్‌షోలకు అనుమతి లేదని, పాదయాత్ర, ఇతర ర్యాలీలకు సంబంధించి జిల్లా కలెక్టర్అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఊరేగింపులకు అనుమతి లేదని, అభ్యర్థులతో పాటు రెండు వాహనాలు, ఇద్దరు/ముగ్గురు వ్యక్తులకు మాత్రమే నామినేషన్ కేంద్రం వద్ద అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లు, ఎలక్షన్సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్పూర్తై ఉండాలని పేర్కొన్నారు. 9,835 మంది ఓటర్లు బ్యాలెట్ ద్వారా ప్రాధాన్యత ఓటు పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయని శశాంక్ గోయల్ తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. మొత్తం 12 స్థానాల్లో 9,835 మంది ఓటర్లు ఉన్నట్లు శశాంక్ గోయల్ తెలిపారు. ఆదిలాబాద్‌లో 931, వరంగల్ 1,021, నల్లగొండ 1,271, మెదక్ 1,015, నిజామాబాద్ 809, ఖమ్మం 769, కరీంనగర్ 1,323, మహబూబ్‌నగర్ 1,394, రంగారెడ్డిలో 1,302 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన చేస్తున్నామని, పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నా, గుర్తులకు బదులు అభ్యర్థుల ఫొటోలు ఉంటాయని తెలిపారు. -
సొంతిల్లెక్కడ కొనాలి?
సాక్షి, హైదరాబాద్ : సొంతిల్లు అనేది సామాన్యుల వరకైతే కలే. ఆ కలను నిజం చేసుకోవాలంటే ముందు సవాలక్ష సందేహాలు. గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటి లో తీసుకోవాలా అనే విషయాల్లో తర్జనభర్జన. ఇల్లు కొనాలనే విషయంలో నిపుణుల సూచనలివిగో.. సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం. మరోసారి నిర్మాణ సామాగ్రి కష్టాలు. ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు.. ఇలా రకరకాల సమస్యలతో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవుతోంది. దేశంలో ఈ రంగం ఒక వెలుగు వెలుగుతున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నేటికీ ఏదోవిధంగా కష్టాలు పడుతూనే ఉంది. ఫలితంగా దాని ప్రభావం నిర్మాణ పనులపై పడుతోంది. అయితే కొందరు బిల్డర్లు కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాటును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. నిర్మాణపనుల్ని నెలల తరబడి సాగదీస్తూ అడిగిన వారికి ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా గత రెండు మూడేళ్ల నుంచి ఇలాంటి ధోరణి కొందరు బిల్డర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోశారంటే సొంతింట్లోకి అడుగు పెట్టేదెన్నడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పది, పదిహేను నిర్మాణాలు చూసి, బ్రోకర్లను క్షుణ్నంగా గమనించి ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంపిక చేసుకున్న తర్వాతే సొమ్మును చెల్లించాలి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూసే ధోరణిని అవలంబించడం మినహాయించి మరెటువంటి ధైర్యాన్ని చేయలేకుండా మిగిలిపోతున్నారు. గత రెండేళ్లుగా పం డగ వేళల్లో ఇల్లు కొన్నవారు నేటికీ గృహప్రవేశం చేయకపోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. స్థిర నివాసమా: స్థిర నివాసం కోసం ఆరాటపడేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలి. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోల్చితే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సేవాపన్నూ క ట్టాల్సిన అవసరం రాదు. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు. పెట్టుబడి కోణమా: పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కాకపోతే అంతకంటే ముందు స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే నిర్ణయానికి రావాలి. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రథమంగా ఇల్లు కొనేవారు సిద్ధంగా ఉన్నవాటిలో కొనుక్కోవడమే మేలు. కాకపోతే పెట్టుబడి దృష్టిలో ఆలోచించేవారికి ఈ తరహా ఇళ్లపై రాబడి తక్కువొస్తుంది. మూడేళ్ల క్రితమున్న రేటుకి ప్రస్తుత ధరకు ఎంతోకొంత వ్యత్యాసముండటమే ఇందుకు ప్రధాన కారణం. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇంటిని కొనడం కంటే నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఇంటి ధర ఎంతలేదన్నా 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.