సాక్షి, హైదరాబాద్: ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సందర్భంగా ప్రభుత్వం గ్రామాలు, బస్తీల్లో జ్వర సర్వేలు చేపట్టింది. జ్వరం వచ్చిన వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లను అందజేసింది. దాదాపు 8 లక్షల మంది జ్వర పీడితులకు కిట్లు ఇచ్చి వైరస్ కట్టడికి కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. ఇది వినూత్న కార్యక్రమం కావడంతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈసారి కూడా జ్వర సర్వేలు చేపట్టాలని నిర్ణయించినట్లు వైద్య వర్గాలు చెప్పాయి.
ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి జ్వర పీడితులను గుర్తించి అక్కడికక్కడే కిట్లను ఇస్తారు. అవసరమైన వారికి కరోనా పరీక్షలు చేయిస్తారు. జ్వరం సర్వేల సమయంలో కోటి హోం ఐసోలేషన్ కిట్లను అందజేయాలని నిర్ణయించారు. సెకండ్ వేవ్‌లో పారాసిట్మాల్, అజిత్రోమైసిన్, లివోసిట్రజిన్, విటమిన్ మాత్రలు, స్టెరాయిడ్స్‌లతో కూడిన హోంఐసోలేషన్ కిట్లు అందించారు.
ఈసారి కిట్లలో స్టెరాయిడ్స్ ఉంచడం లేదని వైద్య వర్గాలు చెప్పాయి. స్టెరాయిడ్స్ అందరికీ అవసరం లేదని, దీనివల్ల గతంలో అనేక మందికి అనారోగ్య సమస్యలు వచ్చాయన్నాయి. కిట్లను త్వరితంగా సిద్ధం చేసేందుకు ఆగమేఘాల మీద ఆర్డర్లు పెట్టారు. మందులను కోట్లలో సేకరించి, వాటిని కిట్లలో ఉంచేందుకు వివిధ కంపెనీలకు బాధ్యత అప్పగించారు.
థియేటర్ల సంగతేంటి?
కేసులు పెరుగుతుండటం, సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో వివిధ అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ సమాలోచనలు చేస్తోంది. పండుగ సందర్భంగా బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతరత్రా వాహనాల్లో ప్రజల రద్దీ ఉంటుంది. మరోవైపు సినిమా హాళ్లు కూడా నిండుతాయి. ఈ నేపథ్యంలో సమగ్రమైన కరోనా జాగ్రత్తలను పాటించాలని, ఆ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని యోచిస్తున్నారు.
ఇక సినిమా హాళ్లలో పక్కపక్కన కూర్చోవడం, గాలి, వెలుతురు పెద్దగా ఉండని స్థితిలో వందల మంది ఉండటంవల్ల వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లలో సగం ఆక్యుపెన్సీకి అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య వర్గాలు చర్చిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment