సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంప్రదాయ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్టు (సీపీజీఈటీ) నోటిఫికేషన్‌కు మోక్షం లభించడం లేదు. వాస్తవానికి ఏప్రిల్/మే నెలల్లో నోటిఫికేషన్‌ను జారీ చేసి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. మూడ్రోజులు గడిస్తే జూలై నెల కూడా ముగియనున్నప్పటికీ సీపీజీఈటీ నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ఇక డిగ్రీ విద్యార్హతతో ప్రవేశాలు చేపట్టే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్, ఎంటెక్‌లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం మార్చి/ఏప్రిల్ నెలల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించారు.
ఆలస్య రుసుము లేకుండా ఆ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడో ముగిసిపోయింది. కరోనా లేకపోతే మే నెలలోనే ఆయా పరీక్షలే ప్రవేశాల కౌన్సెలింగ్ కూడా పూర్తయ్యేది. కరోనా కారణంగా ఇప్పుడు ఆలస్య రుసుముతో వాటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయినా సీపీజీఈటీ నిర్వహణకు ఇంతవరకు నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. డిగ్రీ ఉత్తీర్ణులై పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దాదాపు లక్షన్నర మంది సీపీజీఈటీకి పోటీ పడతారు. పైగా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారానే ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. అయినా ఎంతో ముఖ్యమైన సీపీజీఈటీని ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో నోటిఫికేషన్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
సీపీజీఈటీ నిర్వహణ సంస్థ అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఈ విషయాన్ని పట్టించుకోవడమే మానేసింది. మొన్నటి వరకైతే సీపీజీఈటీకి కన్వీనర్‌ను కూడా నియమించలేదు. ఇటీవల ప్రొఫెసర్ కిషన్‌ను కన్వీనర్‌గా నియమించింది. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారో, దరఖాస్తులను ఎప్పుడు స్వీకరిస్తారోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పైగా పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో.. తాము సన్నద్ధమయ్యేందుకు సమ యముంటుందో, ఉండదోనని, ప్రవేశాలు ఎంత ఆలస్యం అవుతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment