ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203, జీవో 388ల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను ఏకపక్షంగా ప్రతిపాదించిందని, ఈ జీవోల అమలును నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యా యవాది వి.రవీందర్‌రావు ఈ పిటిషన్ దాఖ లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203, జీవో 388ల ద్వారా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 84, 85 ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టును చేపట్టాలంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిశీలన చేసిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని నివేదించింది. ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటా యింపుల ఉల్లంఘన జరగకుండా చూసేందు కు ఇది అవసరమని తెలిపింది. చట్టబద్ధమైన వ్యవస్థ ఉన్నా కూడా దీన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటి మళ్లింపు సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు చూస్తోందని నివేదించింది.
ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారంతో కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశామని, ఈ అంశాన్ని కృష్ణా బోర్డు కూడా రెండుసార్లు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసి ప్రా జెక్టు డీపీఆర్ పంపాలని, అంతవరకు జీవో 203 అమలును నిలిపివేయాలని ఆదేశించిం దని వివరించింది. బోర్డు ఆదేశాలను బేఖాత రు చేసి టెండర్లు పిలవడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆయా అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా చొరవ తీసుకుందని, అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందని వివరించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ సూచనలను, జలశక్తి శాఖ సూచనలను గానీ పట్టించుకోలేదని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం జూలై 15న టెండర్ నోటిఫికేషన్ కూడా జారీచేసిందని నివేదించింది. వెంటనే టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment