50 వేల ఉద్యోగాలు: అవసరాన్ని బట్టి భర్తీ.. | Telangana Government Plan Notification For Jobs | Sakshi
Sakshi News home page

50 వేల ఉద్యోగాలు: అవసరాన్ని బట్టి భర్తీ..

Published Mon, Jul 12 2021 3:30 AM | Last Updated on Mon, Jul 12 2021 9:39 AM

Telangana Government Plan Notification For Jobs  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను దశల వారీగా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాఖల వారీ ఖాళీలు, అవసరాలు, ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (డీఆర్‌) పోస్టుల వివరాల లెక్కను అధికారులు దాదాపు కొలిక్కి తెచ్చారు.

శనివారం 10 శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆర్థిక శాఖ.. ఆదివారం 22 శాఖల అధికారులతో సమావేశమై ఎన్ని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయన్న దానిపై నిర్ధారణకు వచ్చింది. కొన్ని అంశాల్లో స్పష్టత రాకపోయినా మొత్తమ్మీద 45 వేల వరకు డీఆర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ సంఖ్యపై కచ్చితమైన అవగాహన వస్తుందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల లెక్కలతో కూడిన నివేదికను సీఎస్‌కు సోమవారం ఆర్థిక శాఖ సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా మంగళవారం జరిగే కేబినెట్‌ భేటీలో ఉద్యోగ ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఆరేడు శాఖల్లోనే ఎక్కువగా..
గత రెండ్రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తమ వద్ద ఉన్న ఖాళీల లెక్కలను, ఆయా శాఖల లెక్కలను సరిపోలుస్తున్నారు. ఈ క్రమంలో 95 శాతం లెక్కలు సరిపోలినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని శాఖల్లో గెజిటెడ్, జిల్లా స్థాయి పోస్టుల్లో ఒకట్రెండు తేడాలు కనిపించాయని, వీటికి సంబంధించి లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు పంపాలని ఆయా శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించినట్లు సమాచారం.

ప్రభుత్వ శాఖలతో నిర్వహిస్తున్న సమావేశంలో నాలుగో తరగతి ఉద్యోగ ఖాళీల వివరాలు తీసుకోవట్లేదని, ఈ నేపథ్యంలో డ్రైవర్లు, అటెండర్ల లాంటి పోస్టులను ఈసారి భర్తీ చేయట్లేదని సమాచారం. కొన్ని శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టులను ఖాళీగా చూపించలేదని చెబుతున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టెనోలు, లెక్చరర్లు ఉన్న చోట్ల, చాలా కాలం నుంచి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసుకున్న పోస్టులను ఖాళీలుగా చూపలేదని, మరికొన్ని శాఖల్లో మాత్రం అన్ని రకాల పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఖాళీల కింద చూపారని సమాచారం.

డిప్యూటేషన్‌ పోస్టులపై ఈ సమావేశాల్లో స్పష్టత రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. డిప్యూటేషన్‌పై పని చేస్తున్న పోస్టుల్లో మాతృ శాఖలో ఖాళీ చూపెట్టాలా లేదా ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలో ఖాళీ ఉంటే దాన్ని కూడా చూపెట్టాలా అన్న దానిపై అధికారులు ఎటూ తేల్చలేకపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నిర్ణయం మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఈ అంశాన్ని కొలిక్కి తేనున్నారు. అయితే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల ఖాళీల కసరత్తు సోమవారం మధ్యాహ్నానికి పూర్తి కానుంది.
 
విద్య, పోలీస్, పురపాలక, రెవెన్యూ, వైద్య,విద్యుత్‌ శాఖల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. గురుకుల విద్య సంస్థల్లో కూడా పెద్ద సంఖ్యలోనే పోస్టులున్నట్లు అధికారులు చెబుతున్నారు.గిరిజన సంక్షేమ గురుకులాల్లోనే 1,800 వరకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులు తేలినట్లు పేర్కొంటున్నారు. గెజిటెడ్, క్లరికల్‌తో పాటు టీచింగ్‌ సిబ్బంది భర్తీ వేగవంతం చేయాలని సర్కారు యోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement