సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సాధన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను, ఇతర అంశాలను మరో వారం, పదిరోజుల్లో కేంద్ర పర్యావరణ శాఖకు నివేదించనుంది. ఎన్జీటీలో కేసులు, కేంద్రం, బోర్డుల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైన అనుమతులు సాధించే ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అక్టోబర్ కల్లా ఈ ప్రక్రియ పూర్తి లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం ఇప్పటికే సజావుగా ముగించిన సంగతి తెలిసిందే.
ఈఏసీకి సమర్పించే నివేదికలపై కసరత్తు
ఈ ప్రాజెక్టు కోసం 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు కూడా అవసరం కానున్నాయి. ఇప్పటివరకు 26 వేల ఎకరాల భూసేకరణ పూర్తికాగా, ఈ నెల 10న ఐదు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ కార్యక్రమం ముగిసింది. దీంతో ఈ వివరాలతో పాటు జీవ వైవిధ్య నిర్వహణ ప్రణాళిక, మత్స్య సంపద పరిరక్షణ, నిర్వహణ, ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, పునరావాసం పునర్నిర్మాణం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, క్వారీల పునరుద్ధరణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు సమర్పించనున్నారు. జల, వాయు, శబ్ద నిర్వహణ ప్రణాళికలు, ప్రజారోగ్యం, పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ, స్థానిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు తదితరాలపై వివరాలతో పాటు, వాటిపై వెచ్చించే నిధులపై కేంద్రానికి వివరణ ఇచ్చేలా కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్ శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
కాళేశ్వరం అనుభవంతో..
తెలంగాణ తమకు సమర్పించే నివేదికలపై కేంద్ర పర్యావరణ శాఖలోని ప్రాజెక్టుల ఎన్విరాన్‌మెంటల్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) చర్చించి, ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. బ్యారేజీలు, కాలువలు, పంపుహౌస్‌ల నిర్మాణంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. వీటి నిర్మాణాలపై ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ స్పష్టం చేస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ సమయంలో ఈఏసీ పలు సూచనలు చేసింది.
ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలని చెప్పింది. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్‌మెంట్‌ను చేపట్టడంతో పాటు దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. దీంతో పాలమూరుకు అనుమతుల విషయంలో.. ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment