
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన ఓ వ్యక్తికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రాథమిక చికిత్స చేశారు. వారణాసి వెళ్లిన గవర్నర్ తిరిగి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా, ఓ వ్యక్తికి ఛాతీ నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన విమాన సిబ్బంది ఫ్లైట్‌లో ఎవరైనా డాక్టర్‌లు ఉన్నారా అని అనౌన్స్‌మెంట్ చేశారు. విషయం తెలుసుకున్న తమిళిసై వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు.
కోలుకున్న ప్రయాణికుడు సరైన సమయంలో స్పందించిన గవర్నర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. అదే విధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు తమిళిసైకి అభినందనలు తెలిపారు. అయితే విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించి కిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. ఎంబీబీఎస్, ఎండీ డీజీఓ లాంటి వైద్య విద కోర్సులు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment