Telangana Govt Sanctioned 15 Crores For Bonalu Festival - Sakshi
Sakshi News home page

Bonalu Festival: బోనాల ఉత్సవాలకు రూ. 15 కోట్లు మంజూరు

Published Mon, Jul 4 2022 8:51 PM | Last Updated on Mon, Jul 4 2022 9:19 PM

Telangana Govt 15 Crores Sanctioned For Bonalu festival - Sakshi

హైదరాబాద్‌: బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం  అందించే ఆర్ధిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ లతో కలిసి దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్, 24 వ తేదీన జరిగే హైదరాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ నిధులను ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. 

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించే బోనాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. పలు ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 25 వ తేదీన జరిగే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు సందర్భంగా 500 మంది కళాకారులతో చార్మినార్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నగరంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారుల ఆధ్వర్యంలో వివిధ వేషదారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పాతబస్తీ లోని దమయంతి బిల్డింగ్, డిల్లీ దర్వాజ, గోల్కొండ, రవీంద్రభారతి, ఇందిరాపార్క్ వద్ద గల కట్టమైసమ్మ ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, చిలకలగూడ తదితర 8 ప్రాంతాలలో త్రీ డీ మ్యాప్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, సబ్జిమండి ఆలయాలకు ప్రభుత్వ ఖర్చులతోనే అంబారీ ఊరేగింపు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. బోనాల ఉత్సవాల విశిష్ట తను చాటి చెప్పేలా వివిధ ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, పోస్టర్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ అమయ్ కుమార్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఐ అండ్‌ పీఆర్‌ సీఐఈవో రాధాకృష్ణ, డీఆర్‌ఓ సూర్యలత, దేవాదాయ శాఖ ఆర్‌జేసీ రామకృష్ణ, ఏసీలు బాలాజీ, కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement