హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందో శ్వేత పత్రం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పరేడ్ గ్రాండ్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి తెలంగాణలోని దేవాలయాల గురించి మాట్లాడారని, దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టం చేయాలని అన్నారు.
30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మల్లన్న సాగర్ వంటి నూతన ప్రాజెక్ట్ లను నిర్మించడం, 24 గంటల విద్యుత్ సరఫరాతోనే సాధ్యం అయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక ఆందోళనలు చేసిందని, డిల్లీలో ధర్నా కూడా చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రధానమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్‌తోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన 9 ప్రశ్నలకి మోడీ ఒక్క సమాధానం కూడా చెప్పలేదని విమర్శించారు. టెక్స్ టైల్ పార్క్ అన్నారు ఇచ్చారా?...కోచ్ ప్యాక్టరీ ఇచ్చారా?అని ప్రశ్నించారు.
అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని పేర్కొన్నారు. బీజేపీ ని బలోపేతం చేయాలంటే ఇక్కడ కేంద్రం ఏదో ఒకటి ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసి నోటిఫికేషన్ లను జారీ చేసిందని, 8 సంవత్సరాలలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో నరేంద్రమోడి నాయకత్వం బీజేపీ ప్రభుత్వం పోవాలని డిమాండ్ చేశారు. 8 సంవత్సరాల BJP పాలనలో అన్ని వ్యవస్థను బ్రష్టు పట్టించారని ఆరోపించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి MP గా గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మూడేళ్లనుండి సికింద్రాబాద్ ఎన్ని సార్లు వచ్చారు...ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి ని చూసి కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు చూసి ఎంతో ఎంజాయ్ చేశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment