
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా జీవో నంబర్ 83 నుంచి 97 వరకు మొత్తం 15 జీవోలను విడివిడిగా జారీ చేశారు. ఈసారి అనుమతి ఇచ్చిన వాటిలో 9,096 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకు లాల్లోనే ఉన్నాయి.
ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment