గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు రూ.55 కోట్ల చెల్లింపు వ్యవహారం
2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17(ఏ) కింద విచారణకు అనుమతి కోరిన సర్కారు
గవర్నర్ పరిశీలనలో లేఖ
త్వరలో నిర్ణయం తీసుకునే చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా– ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీ రామారావుపై కేసు నమోదు, విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. దీనిపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఈ–కార్ రేస్ వ్యవహారంపై ‘కేటీఆర్ చుట్టూ ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా 2024 ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ నిర్వహణ కోసం ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు జరిపిన రూ.55 కోట్ల చెల్లింపులపై విచారించడానికి 2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17(ఏ) కింద అనుమతి కోరింది.
ఈ చెల్లింపులకు అప్పటి హెచ్‌ఎండీఏ పాలకమండలి అమోదం కూడా లేదని, అంతేకాక ఈ నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ మారకం రూపంలో చెల్లించినట్లు ప్రభుత్వం గవర్నర్‌కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెల్లింపులకు అనుమతినిచ్చినందున ఇప్పుడు ఆయన విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరైంది. కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ కూడా అయిన అర్వింద్‌కుమార్ చెల్లింపులు చేశారు.
గవర్నర్‌తో రేవంత్ భేటీలోనూ ‘విచారణ’ ప్రస్తావన!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కూడా కేటీఆర్ విచారణ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ త్వరగానే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాల సమాచారం. గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఫార్ములా–ఈకి రూ.55 కోట్లు చెల్లింపునకు సంబంధించిన బాధ్యత పూర్తిగా తనదేనంటూ ప్రకటించగా, ఖమ్మంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఆటం బాబు పేలబోతుందంటూ వ్యాఖ్యానించడం.. రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి సంకేతాలనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి తప్పనిసరి!
ఫార్ములా–ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి అర్వింద్‌కుమార్‌తో పాటు సంబంధిత ఇంజనీర్లపై విచారణకు ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం విదితమే. కాగా విచారణ అనంతరం ఐఏఎస్ అధికారిని ప్రాసిక్యూషన్ చేయడానికి మాత్రం కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం (డీవోపీటీ) అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. డీవోపీటీకి మాత్రమే ఐఏఎస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఉన్నందున వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా పనిచేసిన బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన వ్యవహారంలోనూ ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం విదితమే.
ఏమిటీ సెక్షన్ 17(ఏ)..
ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిదంటూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసి విచారణ చేసేందుకు అవకాశం ఉండడంతో.. ఆ కక్ష సాధింపును నివారించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17(ఏ)ను కొత్తగా చేర్చింది. ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కే ఉన్నందున, వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై, వారు మాజీలైన తర్వాత కేసులు నమోదు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి. కాగా 2018లో చట్ట సవరణ తర్వాత నమోదు చేసే కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment