సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసే ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాన ఆస్పత్రుల్లో ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ మెషీన్లు నామమాత్రంగా పనిచేయడం... తరచూ మొరాయించడంతో పాత విధానాన్నే అనుసరిస్తున్నారు.
తాజాగా ప్రతి ఆస్పత్రికి బయోమెట్రిక్ మెషీన్లు కొనుగోలు చేసి పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. గతవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి బయోమెట్రిక్ హాజరుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రెండ్రోజుల క్రితం ఈఎస్‌ఐ డైరెక్టరేట్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
డిసెంబర్ నెలాఖరు కల్లా....
రాష్ట్రంలో ఈఎస్‌ఐ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్‌ఐసీ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మిగతా 3 ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు చేసిన పత్రిపాదనలకు ప్రభుత్వ ఆమోదం రాగానే పది రోజుల్లో మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. మెషీన్ల నిర్వహణ కోసం తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్‌తో అవగాహన కుదుర్చుకోనున్నట్లు సమాచారం.
అలసత్వం వహిస్తే వేతనం కట్...
ఉద్యోగులకు ప్రతి నెలా హాజరు శాతానికి అనుగుణంగానే వేతనాలు ఇవ్వనున్నట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఆస్పత్రిలో ఫిర్యాదుల పెట్టెతో పాటు వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేక విభాగాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment