Telangana HC Stay On NTR Lord Krishna Statue At Khammam - Sakshi
Sakshi News home page

NTR Lord Krishna: కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు వద్దు.. తెలంగాణ హైకోర్టు స్టే

Published Thu, May 18 2023 6:13 PM | Last Updated on Thu, May 18 2023 7:07 PM

Telangana HC Stay On NTR Lord Krishna Statue At Khammam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఖమ్మంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ గురువారం హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. 

ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో తీగల వంతెనకు ప్రత్యేక ఆకర్షణగా.. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా  54 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో ప్రారంభింపజేయాలని భావించిన మంత్రి పువ్వాడ అజయ్‌.. ఆయనకు ఆహ్వానం సైతం అందించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే అసలు వివాదం మొదలైంది. 

శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయడంపైనా హిందూ సంఘాలతో పాటు పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఓవైపు.. కాదని విగ్రహాన్ని ప్రారంభిస్తే కూలుస్తామంటూ భారత యాదవ సంఘం నేతలు హెచ్చరికలు సైతం జారీ చేశారు.  మరోవైపు కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లకుగానూ మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌(మా) నుంచి షోకాజ్‌ నోటీసులు కూడా అందుకుంది. ఇంకోవైపు.. ఈలోపు ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. 

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని అయినా పెట్టుకోండి లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని అయినా పెట్టుకోండి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయొద్దు. ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలి అని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 

తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖులు అందించిన ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే చిత్రకారుడు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఈ విగ్రహాన్ని డిజైన్‌ చేశారు. మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాలనుకున్నారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం.. తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement