సగం పడకలపై చర్చలూ సగమే! | Telangana Health Department Conducts Meeting With Corporate Management | Sakshi
Sakshi News home page

సగం పడకలపై చర్చలూ సగమే!

Published Sat, Aug 15 2020 4:25 AM | Last Updated on Sat, Aug 15 2020 4:25 AM

Telangana Health Department Conducts Meeting With Corporate Management - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని కరోనా పడకల్లో సగం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో విధివిధానాల ఖరారుకు యాజమాన్యాలతో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ జరిపిన చర్చలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడ్డాయి. శనివారం మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి రావాలని అధికారులు, యాజమాన్యాల ప్రతి నిధులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తుండటంతో సగం పడకలను స్వాధీనం చేసుకోవాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయడానికి ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు నేతృత్వంలో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండు గంటలపాటు చర్చించినా ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోయారు.

రూ.4 లక్షలకు మించొద్దు...: ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పడకల ఫీజులు గతంలో కేటాయించినట్లుగానే ఉంటాయి. అంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చికిత్సకు రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్‌ మీద పెడితే రూ.9 వేలు రోజుకు వసూలు చేయాలన్న నిబంధన యథావిధిగానే ఉంటాయి. అయితే పీపీఈ కిట్లు, సాధారణంగా ఇచ్చే మందులు, అత్యవసరమైన అధిక ధర కలిగిన మందులు వాడితే ఎంత తీసుకోవాలన్న దానిపైనే సందిగ్ధత నెలకొందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించాయి. సీటీ స్కాన్లు ఎన్ని చేస్తున్నారు? కొందరికి డయాలసిస్‌ చేయాల్సి వస్తే ఎంత అవుతుంది? ప్రొటోకాల్‌ అమలులో అయ్యే ఖర్చు ఎంత? వివిధ రకాల టెస్టులకు అవుతున్న ఖర్చు ఎంత? దాదాపు నెలకుపైగా చికిత్సలు చేస్తున్నందున అవుతున్న వాస్తవ ఖర్చు వివరాలతో ప్రతిపాదన తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కార్పొరేట్‌ ఆస్పత్రులను కోరాయి.

ఎంత సీరియస్‌ కేసు అయినా 14 రోజులకు గరిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు మించి వసూలు చేయకూడదని సర్కారు భావిస్తోంది. ఆ ప్రకారం సాధారణ కరోనా కేసులకు రూ.లక్షన్నర, ఆక్సిజన్‌ పడకలపైకి వెళితే రూ.2 లక్షలు, వెంటిలేటర్‌పైకి వెళితే రూ.3 లక్షలు, ఒకవేళ ఇంకా సీరియస్‌ అయి ఒకట్రెండు రోజులు ఉంచాల్సి వస్తే రూ.4 లక్షలు కావొచ్చని.. ఏది ఏమైనా సీలింగ్‌ రూ.4 లక్షలకు మించి ఉండకూడదని సర్కారు కార్పొరేట్లకు తేల్చిచెప్పింది. ఇవి కేవలం కార్పొరేట్‌ ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తాయని, వీటిపై నిర్ణయం తీసుకున్నాక మిగిలిన ఇతర ప్రైవేటు ఆస్పత్రులను మరో రెండు మూడు రోజుల్లో పిలిచి వాటితోనూ చర్చిస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇంకా తక్కువ ఫీజులనే ఖరారు చేస్తామని చెబుతున్నాయి. ఇదిలావుంటే ఇక ప్రైవేట్, కార్పొరేట్లు తాము సొంతంగా నింపుకునే సగం పడకల ఫీజులు వాటి ఇష్టానికే వదిలేస్తారని అంటున్నారు. ఒకవేళ అలా వదిలేస్తే ఒకేచోట రెండు ఫీజుల్లో భారీ తేడాతో కొందరు రోగులు కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. దీనిపై విధివిధానాల్లో స్పష్టత రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement