ఆ 850 ఎకరాల భూమి రద్దు సరైనదే..
చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు
వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు
భూముల రద్దును సవాల్ చేస్తూ బిల్లీ రావు వేసిన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.
వివరాల్లోకి వెళితే.. 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా
కేటాయించారు.
ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ కొనసాగగా తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. వైఎస్సార్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్‌ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment