సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిసస్థితులు, నివారణ చర్యలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు వారాల్లో కరోనాకు సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను పూర్తి చేయాలని తెలిపింది. కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోర్టు కోరింది. ప్రైమరి కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని కోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. అధిక ఫీజులు వసూలు చేస్తోన్న ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసి.. చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేయాలని కోర్టు సూచించింది. ప్రతి ఆస్పత్రి వద్ద కోవిడ్ ట్రీట్‌మెంట్ రేట్లను బయట డిస్‌ప్లే చేయాలని కోర్టు సూచించింది. ప్రభుత్వ వసతులను వినియోగించుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత మందికి ఉచితంగా చికిత్స అందించాయో తెలపాలని కోర్టు ఆదేశించింది.
కరోనా పేషెంట్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్‌ను వినియోగించుకుందని.. తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా ఎందుకు తీసుకోకూడదో తెలపాలని కోర్టు ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని తెలిపింది. కొంతమంది ఎన్జీఓలు సివిల్ సొసైటీతో కలిసి ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రసూల్‌పూర్‌లోని హాకీ మైదానాన్ని పరిశీలించాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసిన కోర్టు.. వైద్య శాఖ అధికారులు హాజరు కావాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment