Telangana High Court Hearing On MLAs Purchase Case - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు ఎర’ కేసు: సిట్‌ నోటీసులపై స్టే ఇవ్వలేం: హైకోర్టు

Published Sat, Nov 19 2022 2:27 PM | Last Updated on Sun, Nov 20 2022 9:51 AM

Telangana High Court Hearing On MLAs Purchase Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలన్న ఆ పార్టీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తును అడ్డుకోలేమని పేర్కొంది. తదు పరి ఆదేశాలిచ్చే వరకు సంతోష్, శ్రీనివాస్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. సీఆర్‌పీసీ 41(ఏ) నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. వెంటనే నోటీసులు అందజేసి విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఉన్న సంతోష్‌కు నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు.. సిట్‌కు సహకరించాలని సూచించింది.

ఈ మేరకు వివరాలను ఢిల్లీ పోలీసులకు ఈ–మెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా పంపాలని సిట్‌ను ఆదేశించింది. సీఆర్‌పీసీ 41(ఏ) నోటీసులు ఇవ్వ డం.. నిందితుల విచారణ లాంటి అంశాలు మీడియాకు ఎలా లీక్‌ అవుతున్నాయని ప్రశ్నించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించింది. దర్యాప్తు వివరాలను సింగిల్‌ జడ్జికి అందజేయాలని మాత్రమే ద్వి సభ్య ధర్మాసనం చెప్పిందని.. అనుమతి తీసుకోమని చెప్పలేదని స్పష్టం చేసింది.

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఘటనలో ప్రధాన నిందితులకు బీఎల్‌ సంతోష్, శ్రీనివాస్‌తో సంబంధాలు ఉన్నాయని.. విచారణకు రావాలంటూ సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందజేసేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని సిట్, నోటీసులు ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు  శనివారం విచారణ చేపట్టింది. వాదనల తర్వాత.. దర్యాప్తును రోజువారీ పర్యవేక్షణ చేయాలన్న బీజేపీ అభ్యర్థనపై ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ చిదంబరేశ్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) రామచంద్రరావు వాదనలు వినిపించారు.  

41ఏ కింద నోటీసులు ఎలా ఇస్తారు... 
చిదంబరేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ద్వి సభ్య ధర్మా సనం ఆదేశాల మేరకు నోటీసుల జారీకి సిట్‌ సింగిల్‌ జడ్జి అనుమతి తీసుకోవాలి. కానీ, తీసుకోలేదు. నోటీసుల జారీ, నిందితుల విచారణకు సంబంధించి దర్యాప్తు వివరాలను మీడియాకు లీకులిస్తోంది. ఆ వివరాలన్నీ పత్రికలు, చానళ్లలో ప్రసా రమయ్యాయి. ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది.

అసలు ఈ కేసులో సంతోష్‌ నిందితుడు కాదు. అయినా అతనికి నోటీసులు ఇచ్చారు. మనీశ్‌ మహేశ్వర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌ తీర్పు ప్రకారం.. నిందితుడు కాని వారికి సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇవ్వాలి. సెక్షన్‌ 41ఏ కింద కాదు. విచారణకు వచ్చిన వెంటనే ఆయనను అరెస్టు చేయడం కోసమే ఈ నోటీసులు ఇచ్చారు. అతన్ని అరెస్టు చేస్తే రాజకీయ వివాదంగా మారే పరిస్థితి ఉంది. ఇది ద్వి సభ్య ధర్మాసనం ఉత్తర్వులకు విరుద్ధం. బీజేపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తూ.. ఆ పార్టీకి లోకస్‌(అర్హత) లేదనడం అర్థరహితం. ఈ విషయం విచారణలో ఉంది. దీని పై ద్వి సభ్య ధర్మాసనం కూడా కలుగజేసుకోలేదు. విచారణ పారదర్శకంగా సాగాలన్నదే పిటిషనర్‌ ఉద్దేశం. ఈ క్రమంలో నోటీసులపై స్టే విధించాలి’అని నివేదించారు. 

ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.. 
ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘నోటీసులు ఇ చ్చేందుకు సహకరించాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. 16న సిట్‌ వెళ్లినా వారు సహకరించలేదు. బీజేపీ ప్రధాన కార్యాయానికి అధికారులు వెళ్లినా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఇది ద్వి సభ్య ధర్మాసనం ఆదేశాల ఉల్లంఘనే అవుతుంది’ అని చెప్పారు. ఈ కేసులో మనీశ్‌మహేశ్వరీస్‌ తీర్పు వర్తించదని ఏజీ పేర్కొన్నారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. ఆడియో, వీడియోలోని విషయాలను ఖరారు చేసుకోవడానికి వారిని విచారణ చేయాల్సి ఉందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement