Telangana High Court Notices To CM KCR, Deets Inside - Sakshi
Sakshi News home page

‘కారు’చౌకగా భూములెలా?

Published Thu, Jun 23 2022 1:42 PM | Last Updated on Fri, Jun 24 2022 12:43 AM

Telangana High Court Notices To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి బంజారాహిల్స్‌లో స్థలం కేటాయింపుపై వివరాలివ్వాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఆదేశాలిచ్చింది. టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌లో కారుచౌకగా భూమి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కె.మహేశ్వర్‌రాజ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ‘గుర్తింపు పొందిన పార్టీలకు జిల్లా కేంద్రాల్లో గజానికి రూ. 100 చొప్పున ఎకరం స్థలం కేటాయించేలా 2018లో ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ క్రమంలో 2022 మే 11న బంజారాహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం గజానికి రూ. 100 చొప్పున 4,935 గజాలను రూ. 4,93,500కు ప్రభుత్వం కేటాయించింది.

మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ గజానికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలు ఉంటుంది. మొత్తం విలువ రూ. 110 కోట్ల వరకు ఉంటుంది. 33 జిల్లా కేంద్రాల్లో కూడా రూ. 100 చొప్పున ఎకరం స్థలం పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు. ఈ స్థలం కేటాయింపులో సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించారు. 2005లో టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో పార్టీ కార్యాలయంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఓ చానల్‌ను కూడా నిర్వహిస్తు న్నారు.

డబుల్‌ బెడ్రూం ఇళ్లకు హైదరాబాద్‌లో స్థలం లేదంటున్న ప్రభుత్వం... పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించడం ఏకపక్ష నిర్ణయం’ అని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితోపాటు సీసీఎల్‌ఏ, రెవెన్యూ సీఎస్, హైదరాబాద్‌ కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 20కి వాయిదా వేసింది.  

ఇది కూడా చదవండి: సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్‌ సైనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement