
సినిమాల ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్లలోపు పిల్లలను ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో సినిమాల ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేళాపాళా లేని రాత్రి ప్రదర్శనలు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై అన్ని వర్గాలతో చర్చించి చట్ట ప్రకారం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు థియేటర్ల యజమానులు 16 ఏళ్లలోపు పిల్లలను ఆయా వేళల్లో సినిమా ప్రదర్శలనకు అనుమతించొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రత్యేక షోలకు వేకువజామున 4 గంటల నుంచి మొదలుకుని 6 షోలకు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్ లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టి.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు.