సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది. దీంతో పాటే నందుకుమార్ భార్య చిత్రలేఖ, నిందితులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై కూడా జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
కేసు దర్యాపును కేంద్ర ఏజెన్సీలకు అప్పగించాలని అడిగే అర్హత (లోకస్ స్టాండీ) బీజేపీకి ఉందా? లేదా? అనే అంశంపై వాదనలు వినిపించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ‘అసలు ఈ కేసులో బీజేపీకి పిటిషన్ వేసే అర్హతే లేదు. ఈ కేసుకు సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో బీజేపీ పేరుగాని, వారి నాయ కుల పేర్లుగానీ లేవు. వారు నిందితులు కాదు.
బాధితులు కాదు. వారికి వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. ఈ కేసుతో వారికి ఎటువంటి సంబంధం లేదు. దర్యాప్తు వివక్షాపూరితంగా కొనసాగుతోందని చెప్పడానికి వారెవరు?కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతుంది. దర్యాప్తు జాప్యమైతే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది. నిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేయాలి. దీని కోసం స్టేను ఎత్తివేయాలి’అని నివేదించారు.
ప్రభుత్వం, వారి న్యాయవాదుల భిన్నవాదనలు..
‘రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్టపాలు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మీడియాకు సాక్ష్యాలను ఇవ్వడమే కాకుండా బీజేపీ, కేంద్ర నాయకత్వంపై తీవ్రమైన మాటల దాడి చేశారు. జాతీయ స్థాయిలో దీనిపై ప్రచారం జరిగింది, ఈ వ్యవహారంలో పిటిషనర్ పార్టీ బాధితురాలేనని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆరోపణల నేపథ్యంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ముఖ్యమంత్రి నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వంపై మాటల దాడి చేస్తుంటే కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు అందుకు భిన్నంగా బీజేపీకి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మా వాదనను తోసిపుచ్చడం సరికాదు’అని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.
ఆ ఉత్తర్వులు మాకు ఇవ్వండి..
ఒకవేళ బీజేపీకి పిటిషన్ వేసే అర్హత లేదని అనుకుంటే.. మధ్యంతర ఉత్తర్వులను తమకు ఇవ్వాలని ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందుకుమార్ తరఫున హాజరైన కర్ణాటక హైకోర్టు మాజీ అడ్వొకేట్ జనరల్ ఉదయ. హెచ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మీడియా భేటీ పెట్టి రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచారన్నారు.
సీఎం, ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు ఎదుట ఒకలా.. ప్రజల ముందు మరోలా మాట్లాడుతున్నారని ఇంప్లీడ్ పిటిషనర్ తరఫున న్యాయవాది అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. బీజేపీ పిటిషన్ వేసే అర్హత ఉందా? లేదా? అనే దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. నిందితుల పిటిషన్‌ను వేరుగా విచారిస్తామని పేర్కొంది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కాగా, చిత్రలేఖ రిట్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు న్యాయమూర్తి అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment