
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో చనిపోయిన పారిశుధ్య కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇచ్చారో లేదో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనల మేరకు ఏ ప్రభుత్వ విభాగం పరిహారం చెల్లించాలి, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంత మంది కార్మికులు చనిపోయారు, మనుషులతో సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించే విధానాలను రాష్ట్రంలో నిషేధించారా, ఇప్పటికీ ఈ వృత్తిలో ఎంత మంది ఉన్నారు, వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించారా.. తదితర వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. గతేడాది డిసెంబర్‌లో హైటెక్ సిటీ కొండాపూర్‌లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను ధర్మాసనం గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించింది.
మృతి చెందిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని గతంలో జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది నివేదించారు. పరిహారమివ్వకపోతే తదుపరి విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ హాజరు కావాల్సి ఉంటుందని ధర్మాసనం గతంలో ఆదేశించింది. దీంతో సోమవారం కమిషనర్ లోకేష్‌కుమార్ హాజరయ్యారు. చనిపోయిన కార్మికులకు పరిహారమిచ్చే బాధ్యత తమది కాదని వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ నివేదించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment