మళ్లీ అడుగుతున్నాం.. నోడల్ ఏజెన్సీకి ఎందుకంత దూకుడు.. హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
ముందు రోజు నోటీసులు ఇచ్చి తెల్లారే కూల్చేస్తారా?
సెలవు రోజు కూడా కనీస అవకాశం ఇవ్వరా?.. కోర్టు పరిధిలో ఉన్న ఆస్తిని ఎలా నేలమట్టం చేస్తారు?
హైడ్రా కమిషనర్ నేరుగా హాజరై వివరణ ఇవ్వాల్సిందే..
30న ఉదయం 10.30కు రావాలని కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ‘‘గతంలోనూ అడిగాం.. మరోసారి అడుగుతున్నాం. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పండి’’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నోడల్ ఏజెన్సీ ఎందుకు అంత దూకుడుగా వెళ్తుందో అర్థంకావడం లేదని.. శనివారం నోటీసులు అందితే ఆదివారం ఉదయం కూల్చివేస్తారా అని అసహనం వ్యక్తం చేసింది. ‘కనీసం సెలవు రోజు కూడా అవకాశం ఇవ్వరా? సోమవారం వరకైనా ఆగే పరిస్థితి లేకపోవడానికి కారణం ఏమిటో చెప్పండి’అని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. దీనిపై ఈ నెల 30న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.
కోర్టు పరిధిలో ఉన్నా కూల్చివేతతో..
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ గ్రామపంచాయతీ నుంచి 2022 నవంబర్ 10న మహ్మద్ రఫీ భవన నిర్మాణ అనుమతి పొందారు. ఈ మేరకు సర్వే నంబర్ 165, 166లోని తన 270 గజాల స్థలంలో 24 నెలల్లో అంటే 2024 నవంబర్ 10 కంటే ముందు నిర్మాణం పూర్తి చేయాలి. ఈ మేరకు పూర్తి చేశారు. ఈ నిర్మాణాన్ని గణేశ్ అనే నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఈ నిర్మాణం అక్రమమంటూ తహసీల్దార్, హైడ్రా దాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మహ్మద్ రఫీ, గణేశ్ నిర్మాణ సంస్థ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ విచారణ సందర్భంగా తాము ఎలాంటి కూల్చివేత కార్యక్రమం చేపట్టడం లేదని, అధికారులెవరూ ఇంతవరకు ఆ భవనాన్ని సందర్శించలేదని హైడ్రా కోర్టుకు వెల్లడించింది. దీంతో పిటిషనర్ల భవనం విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ కోర్టు విచారణను ముగించింది. మరోవైపు సదరు భవనానికి నిర్మాణ అనుమతి రద్దు చేస్తూ అధికారులు ఇచ్చిన నోటీసులను కూడా పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌లో విచారణ చేపట్టిన కోర్టు.. నోటీసులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. అంతేగాకుండా ఆ నిర్మాణం అక్రమమంటూ, ప్రభుత్వ భూమిలో నిర్మించారంటూ అధికారులు ఇచ్చిన నోటీసులకు పిటిషనర్లు వివరణ కూడా ఇచ్చారు. ఈ వివరణపై సంతృప్తి చెందని తహసీల్దార్.. 48 గంటల్లో బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ ఈ నెల 20న స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు. 22న కూల్చివేత చేపట్టారు. దీంతో పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
ఒక్కరోజులోనే వచ్చి నేలమట్టం చేశారు..
ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టా రు. పిటిషనర్ తరఫున న్యాయవాది జి.నరేందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఈ నెల 20న ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్ 21న సాయంత్రం పిటిషనర్‌కు అందింది. ఆదివారం ఉద యం 7.30 గంటలకే అధికారులు భవనం వద్దకు వచ్చారు. బుల్డోజర్లు, జేసీబీతోపాటు సిబ్బందిని మోహరించారు. భవనంలోని సామగ్రిని బయటికి విసిరేశారు. విద్యుత్ కట్ చేసి, నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు..’’అని కోర్టుకు విన్నవించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అందజేశారు.
మరోవైపు హైడ్రా కమిషనర్ ఇచ్చిన రాతపూర్వక వివరాలను హైడ్రా తరఫు స్టాండింగ్ కౌన్సిల్ కటిక రవీందర్‌రెడ్డి కోర్టుకు సమరి్పంచారు. ‘‘తహసీల్దార్ నుంచి ఈ నెల 21న హైడ్రాకు లేఖ అందింది. జూలై 19న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 99 ప్రకారం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మా బాధ్యత. నోడల్ ఏజెన్సీగా స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తున్నాం. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ గ్రామం సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించడానికి తహసీల్దార్ విజ్ఞప్తి మేరకు చర్యలు చేపట్టాం. పోలీసులు, ఇతర సిబ్బందితోపాటు యంత్రాలను పంపించాం’’అని కోర్టుకు వివరించారు.
కోర్టు ఆదేశాలున్నా లెక్క లేదా?
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి హైడ్రాపై ఘాటుగా స్పందించారు. ‘‘భవనం కూల్చివేత కార్యక్రమంలో భాగస్వాములైన అమీన్‌పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్, అమీన్‌పూర్ మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి, పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, పటాన్ చెరు డీఎస్పీ, టీఎస్‌ఎస్పీడీసీ ఏఈ(ఆపరేషన్స్) చర్యలు చట్టవిరుద్ధం. రిట్ పిటిషన్ 24724/2024లో సెపె్టంబర్ 5న ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారు. దీనికి సమాధానం చెప్పాల్సిందే. హైడ్రా కమిషనర్‌తోపాటు అమీన్‌పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి. ఈ నెల 30న ఉదయం 10.30 గంటలకు నేరుగా హాజరుకాలేని పక్షంలో వర్చువల్‌గా పాల్గొని సమాధానమివ్వా లి. ఈలోగా అమీన్‌పూర్ మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సి ల్ తరఫు న్యాయవాది కమిషనర్ నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలి’’అని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment