భార్య హత్య కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: భార్య హత్య కేసులో భర్తకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడం సరైందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘మృతిరాలితో అప్పీలెంట్ (భాస్కర్)కు వివాహం జరిగి నాలుగు నెలలే అయ్యింది. ఆమె మంటల్లో కాలిపోతున్నప్పుడు గదిలో నిందితుడు ఉన్నాడని సాకు‡్ష్యలు చెబుతున్నారు. ఆ మంటలను ఆర్పేందుకు అతను ఎలాంటి చర్యలు చేపట్టలేదు. భర్తకు వ్యతిరేకంగా మృతురాలు తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందనడానికి ఎలాంటి కారణాలు లేవు. ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదు’ అని హైకోర్టు తీర్పునిచ్చింది.
2012లో జరిగిన హత్య కేసులో అప్పీలెంట్‌కు జీవిత ఖైదు సరైందేనని 2015లో తేల్చిచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పెద్దింటి భాస్కర్‌కు మృతురాలితో 2012, ఏప్రిల్ 25న వివాహం జరిగింది. వివాహం తర్వాత నెల పాటు దంపతులు భార్య తల్లిగారింట్లోనే ఉన్నారు. 2012, జూలై 15న రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించారు. అయితే తనకు పీడకలలు వస్తున్నాయని, తల్లి వద్ద నిద్రిస్తానని భాస్కర్‌ను కోరింది. అందుకు నిరాకరించి దుర్భాషలాడుతూ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆసుపత్రిలో మృతురాలు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భాస్కర్‌ను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది.
బాధితురాలి మానసిక స్థితి బాగానే ఉంది...
2015, ఏప్రిల్ 17న రంగారెడ్డి జిల్లా కోర్టు తనకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పెద్దింటి భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జితేందర్‌రావు వీరమల్ల వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మృతురాలి తల్లి కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదని, పథకం ప్రకారం హత్య చేశాడని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... బాధితురాలి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునేముందు ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని డాక్టరు ధ్రువీకరించారని పేర్కొంది. మరణ వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ అప్పీలును కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment