సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర, మల్లు భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కాదని.. వ్యవస్థలో మార్పు కోసమేనని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రధాని పదవి కోసం చేయలేదని, దేశంలో నెలకొన్న విద్వేషాలను తొలగించేందుకు చేశారని చెప్పారు.
తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి.. రాహుల్ సందేశాన్ని వివరిస్తూ వ్యవస్థలో మార్పు కోసం పాదయాత్రలు చేస్తున్నారని వివరించారు. ఆ మార్పు కోసం కాంగ్రెస్ పారీ్టకి ఓటు వేయాలని కోరారు. ‘పీపుల్స్‌మార్చ్ ఫర్ ఛేంజ్’ పేరుతో ప్రారంభమైన భట్టి పాదయాత్ర 69వ రోజు 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గురువారం నిర్వహించిన బహిరంగ సభకు హిమాచల్ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ కారణంగానే దేశాభివృద్ధి
స్వాతంత్య్రం వచి్చన తొలినాళ్లలో దేశంలో గుండుసూది కూడా తయారు చేసే పరిస్థితి లేదని.. ఆ స్థితి నుంచి ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పారీ్టయే కారణమని సుఖు చెప్పారు. 2004లో సోనియాగాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ త్యాగం చేశారని గుర్తు చేశారు. అప్పట్లో సోనియా ప్రధాని కావాలని చెప్పిన పారీ్టల్లో బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్ కూడా ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ తరహాలో ఓపీఎస్ (పాత పింఛను విధానం) తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు అన్నం పెట్టేందుకు కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కరోనా కాలంలో ఎంతోమంది పేదలకు ఆ పథకం కడుపు నింపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్, భట్టిల పాదయాత్రలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలందరితో కలిసి బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. అన్ని జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
కేసీఆర్ కిడ్నీలు ఇచ్చినా జనం నమ్మరు: రేవంత్‌రెడ్డి
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్లను ఇచ్చే ఆలోచన చేస్తున్నారని, కేసీఆర్ కిడ్నీలు ఇచ్చినా జనం నమ్మే పరిస్థితిలో లేరని రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితే, బడుగుల బిడ్డలు వలసలు పోవాలా? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసిన కేసీఆర్, పాలమూరుకు మాత్రం చుక్కనీరు తేలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి అండగా నిలవాలని కోరారు. రేవంత్‌రెడ్డి పరోక్షంగా అలంపూర్ అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. వెనుకబడిన అలంపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంపత్‌కుమార్‌ను అధిక మెజారీ్టతో గెలిపించాలన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితో తిరగబడాలి: భట్టి
‘కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో లాక్కొంటోందని.. ఈ భూములపై పోరాడతాం.. రుతుపవనాలు వస్తున్నాయి.. మేమంతా వచ్చి అరకలు దున్నిస్తాం..’ అంటూ రైతులకు భట్టి విక్రమార్క భరోసా కలి్పంచారు. కాంగ్రెస్ పంచిన భూములను కాపాడుకునేందుకు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు గుర్తించామని ఆయన తెలిపారు. తొమ్మిదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేయని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సభలో మొదటగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తామూ నల్లగొండలో 12 సీట్లను గెలిపించి మొత్తం 24 సీట్లతో కాంగ్రెస్‌కు ఆధిక్యాన్ని కట్టబెడతామని చెప్పారు. సభలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నవీన్ జావెద్, కొప్పుల రాజు, టీపీసీసీ నేతలు వి.హన్మంతరావు, అనిరు«ద్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బహిరంగసభకు హాజరయ్యేందుకు సిమ్లా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచి్చన సుఖుకు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, వంశీచందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు. దాదాపు అర్ధగంటకు పైగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment