సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనే ’వికీపీడియా’లో తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగులో అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం కొద్దిమంది ఔత్సాహికులు వికీపీడియా లో రాష్ట్ర సమాచారం తెలుగులో పొందుపరుస్తుండగా, దీనిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఔత్సాహికులు, నిపుణు లు, జర్నలిస్టులు, భాషాభిమానుల సహకారం తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇటీవల ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించి, ఇంటర్న్‌నెట్‌పై ఆసక్తి చూపుతున్న వారిని ఎంపిక చేసింది. తెలుగు వికీని ఎలా ఉపయోగించుకోవాలి? సమాచారం సేకరణ, ఉన్న వివరాల్లో లోపాలు సరిదిద్దడం వంటి అంశాలపై వీరికి వర్చువల్ విధానంలో ఫిబ్రవరి 1 నుంచి శిక్షణ ఇస్తోంది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్నీ వికీ వ్యాసాల్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర అవతరణ తర్వాత భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాల్లోని సమాచారాన్నీ తెలుగులో అందుబాటులోకి తెస్తారు.
గ్రామీణులకూ చేరేలా స్థానిక భాషలో సమస్తం...
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘టీ ఫైబర్’ప్రాజెక్టు ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇంటర్నెట్‌లో వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని తెలుగులో అందుబాటులోకి తేవడంపైనా దృష్టి సారించింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో రాష్ట్రంలోని వివిధ రంగాలు, అంశాల సమాచారం స్థానిక భాషలో అందుబాటులోకి తెస్తోంది. వికీపీడియాలో ఇంగ్లిషులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ట్రిపుల్ ఐటీ భాగస్వామ్యంతో కేంద్ర ఐటీ శాఖ ‘ఇండిక్ వికీ ప్రాజెక్టు’చేపట్టింది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ఐటీ శాఖ కూడా భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు వికీపీడియాలో సమాచార లభ్యత, సముదాయ అభివృద్ధి, శిక్షణ, అవగాహన, సాంకేతికత, పరిశోధన తదితర కోణాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ కూడా సిద్ధం చేసింది.
తెలుగులో 70 వేల పేజీల సమాచారం..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 438 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, ఇందులో మన దేశం నుంచి 56 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇది దేశ జనాభాలో 40 శాతం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 28 భాషల్లో భారత్‌వి ఎనిమిది ఉన్నా, వికీపీడియాలో మాత్రం భారతీయ భాషల్లో సమాచారం అంతంత మాత్రంగానే ఉంది. ఇందులోనూ అత్యధికంగా హిందీ, తమిళం, బెంగాలీలో అందుబాటులో ఉండగా తెలుగు నాలుగో స్థానంలో ఉంది. వికీపీడియాలో లక్షల కొద్ది పేజీల సమాచారం అందుబాటులో ఉండగా, హిందీలో 1.34 లక్షల పేజీలు, తెలుగులో సుమారు 70 వేల పేజీల సమాచారం మాత్రమే ఉంది. స్థానిక భాషలో సమాచారం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, పర్యాటక విశేషాలు, ప్రముఖుల సమాచారం తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
తెలుగు వికీపిడియాలో తెలంగాణ సమాచారం
Published Fri, Feb 5 2021 8:38 AM | Last Updated on Fri, Feb 5 2021 1:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment