సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం | telangana inspiration to the country cm kcr independence day speech | Sakshi
Sakshi News home page

 ఎనిమిదేళ్లలో అనితర సాధ్యమైన పురోగతి.. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్‌ 

Published Tue, Aug 16 2022 1:37 AM | Last Updated on Tue, Aug 16 2022 1:33 PM

telangana inspiration to the country cm kcr independence day speech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘స్వతంత్ర భారతంలో ఆరు దశాబ్దాలు అస్తిత్వం కోసం ఉద్యమించిన తెలంగాణ.. ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించి యావత్‌ దేశానికే దిక్సూచిగా మారింది. అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తూ ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. వ్యవసాయం సంక్షోభం నుంచి పుంజుకొని 11.6 శాతం వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. కేసీఆర్‌ ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. 

బలీయ శక్తిగా ఎదుగుతున్నాం 
‘‘తెలంగాణ ప్రతి రంగంలో దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తోంది. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావమే దీనికి కారణం. పారిశ్రామిక రంగంలో 12.01 శాతం వృద్ధిరేటుతో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. ఐటీ ఎగుమతుల్లో 26.14% వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఎనిమిదేళ్లలోనే రాష్ట్రం బలీయ ఆర్థిక శక్తిగా ఎదిగి దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా మారింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైంది. ఏడేళ్లలో రాష్ట్ర జీఎస్‌డీపీ 127 శాతం పెరిగితే.. దేశ జీడీపీ పెరిగింది 90 శాతమే. 2013–14లో సుమారు రూ.లక్షగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2021–22 నాటికి రూ.2.75 లక్షలకు పెరిగింది. ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే 84 శాతం అధికం. 

అదనంగా 10 లక్షల పింఛన్లు అమల్లోకి.. 
ఇది తెలంగాణ సంక్షేమంలో స్వర్ణ యుగం. ఈ పంద్రాగస్టు నుంచే మరో 10 లక్షల మందికి పింఛన్లను అందిస్తున్నాం. దళితుల అభ్యున్నతి కోసం విప్లవాత్మకంగా దళితబంధు పథకాన్ని తెచ్చి రూ.10 లక్షలను గ్రాంటుగా అందిస్తున్నాం. కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్‌షాపుల్లో 261 దుకాణాలను దళితులకే కేటాయించాం. గొల్లకుర్మల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ చేపట్టాం. వేల కోట్ల విలువైన మత్స్య సంపదను సృష్టించాం. నేతన్నకు బీమా అమలు చేస్తున్నాం. ఆరేళ్లలో 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాం. రూ.57,880 కోట్లను రైతు బంధు అందించాం. ఈ పథకం అత్యుత్తమమని ఐక్యరాజ్యసమితి కూడా కొనియాడింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా బలోపేతం చేసేందుకు మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పల్లె ప్రగతి రూపంలో ఊళ్లు బాగుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే కావటం దీనికి ఉదాహరణ. 

వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం.. 
వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం, డయాలసిస్‌ సెంటర్లనూ అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌ నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. నిమ్స్‌లో మరో 2 వేల పడకల ఏర్పాటు, వరంగల్‌లో ఆధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకోగా.. మరో 91,142 పోస్టులను భర్తీ చేసుకుంటున్నాం. 

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగింది.. 
తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ బాగా పెరిగింది. టీఎస్‌ ఐపాస్‌తో పరిశ్రమల స్థాపన సులభమై పెట్టుబడులు పెరిగాయి. ఎనిమిదేళ్లలో రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించాం. 1,500కుపైగా చిన్న, పెద్ద ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువయ్యాయి. ఐటీ ఉద్యోగాల సృష్టిలో కర్ణాటకను వెనక్కి నెట్టి తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఐటీ ఎగుమతుల విలువ 1.83 లక్షల కోట్లకు పెరిగింది. టీ–హబ్‌ 2.0 ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా నిలిచింది. 

అప్పుల పేరుతో బురద చల్లుతున్నారు 
తెలంగాణ అనూహ్య ప్రగతి సాధిస్తుంటే.. కొందరు మాత్రం అప్పులు ఎక్కువగా చేస్తోందంటూ కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. కేంద్రం లెక్కల ప్రకారమే 2019–20 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,25,450 కోట్లు. 2014లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75,577 కోట్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,49,873 కోట్లు మాత్రమే. దీన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడిగానే వినియోగించాం. జీఎస్‌డీపీ ప్రకారం దేశంలో 22 రాష్ట్రాలకు తెలంగాణ కన్నా అధికంగా అప్పులు ఉన్నాయి. జీఎస్‌డీపీలో రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23:5 శాతమే.. అదే జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50:4 శాతం. ఈ వాస్తవాన్ని గమనించకుండా కొందరు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారు. 

సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు 
కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి, విలువలకు తూట్లు పొడుస్తోంది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీన పరిచే కుట్రలు చేస్తోంది. పన్నుల ఆదాయంలో న్యాయబద్ధంగా 41 శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉన్నా.. సెస్‌ల విధింపు రూపంలో దొడ్డిదారిన దోచుకుంటోంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి చివరికి తోక ముడిచింది. ప్రధాని స్వయంగా క్షమాపణ చెప్పారు. కేంద్రం పాల నుంచి శ్మశానవాటికల దాకా అన్నింటిపై పన్నులతో జనంపై భారం మోపుతోంది. ఉచితాలు అంటూ సంక్షేమ పథకాల అమలును అవమానిస్తోంది. 

తెలంగాణలో మత చిచ్చు రేపే యత్నం 
కేంద్రం అసమర్థత వల్లే దేశ ఆర్థిక వృద్ధి కుంటుపడింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూపాయి విలువ పడిపోయింది. వీటన్నింటినీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకే కొందరు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్టు దాడులకు తెగబడుతున్నారు. ఇది చూసి స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. తెలంగాణలోనూ మతచిచ్చు రేపి సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి, అభివృద్ధిని ఆటంకపర్చేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరముంది. 

రవీంద్రుడి ప్రార్థనను గుర్తు చేసుకుందాం.. 
‘ఎచట మనస్సు నిర్భయంగా ఉండగలదో, ఎచట మనిషి ఆత్మ విశ్వాసంతో తలెత్తుకుని తిరగగలడో, ఎచట జ్ఞానానికి ఎట్టి ఆటంకమూ ఉండదో, ఎచట లోకం ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో, ఎచట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ ముందుకు సాగిపోతుందో.. అటువంటి స్వేచ్ఛాధామమైన భూతల స్వర్గంలో.. తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు..’ అన్న విశ్వకవి రవీంద్రుడి ప్రార్థనలోని ఉదాత్త విలువలను మననం చేసుకుందాం. స్వాతంత్య్రోద్యమ ఆశయాలను కాపాడుకోవడానికి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. 

నల్లగొండ గోస మీద పాట కూడా రాసిన.. 
ఫ్లోరైడ్‌ బాధితులకు అండగా ఉద్యమకాలంలో నల్లగొండ నగారా పేరుతో నేను స్వయంగా పోరాడాను. ‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండ’ అంటూ అప్పట్లో ఓ పాట కూడా రాశాను. ఇప్పుడు ఆ ఫ్లోరైడ్‌ భూతం లేకుండా స్వచ్ఛమైన నీటిని నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. మిషన్‌ భగీరథ పేరుతో 100 శాతం ఆవాసాలకు మంచినీళ్లు అందిస్తున్నాం. తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా మారిందని పార్లమెంటు వేదికగా కేంద్రం కొనియాడింది. 

గోల్కొండ కోటలో ఉత్సాహంగా వేడుకలు 
దేశ స్వాతంత్ర వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం 10.07 గంటలకు ఆయన కోట వద్దకు చేరుకున్నారు. లోపల రాణిమహల్‌ ముందున్న పచ్చిక బయళ్లలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత వాహనంలో లోపలికి వచ్చారు. 10.15 గంటల సమయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ప్రసంగించారు. సీఎం ప్రసంగానికి ముందు, తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి. అయితే సీఎం ప్రసంగం కాసేపట్లో ముగుస్తుందనగా వర్షం ప్రారంభమైంది. త్రివర్ణ దుస్తుల్లో పరేడ్‌ నిర్వహించి నేలమీద కూర్చున్న విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. కోట గోడల మీద నిలబడ్డ కళాకారులు తడిసిపోయారు. ఇక సీఎం వెళ్లిపోగానే అంతా గోల్కొండ నుంచి బయటికి రావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.
చదవండి: గవర్నర్‌ తేనీటి విందుకు సీఎం కేసీఆర్‌ డుమ్మా.. ఆఖరి నిమిషంలో..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement