ఉద్యోగుల ఉద్యమ బాట | Telangana JAC has announced activities to solve the problems | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఉద్యమ బాట

Published Wed, Oct 23 2024 3:55 AM | Last Updated on Wed, Oct 23 2024 3:55 AM

Telangana JAC has announced activities to solve the problems

సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ జేఏసీ 

కొత్త ప్రభుత్వమని 10 నెలలు వేచి చూశాం: జాయింట్‌ యాక్షన్‌ కమిటీ

సీఎంఆర్‌ఎఫ్‌కు మేం రూ.130 కోట్లు ఇచ్చినప్పుడు రెండురోజుల్లో సమావేశం అన్నారు 

ఇప్పుడు సీఎం రేవంత్, సీఎస్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు 

డీఏలు మరిచిపోయారు..జీపీఎఫ్‌లో ఉన్న డబ్బులు కూడా తీసుకునే పరిస్థితి లేదు 

ఈ నెల 26న కేబినెట్‌లో పరిష్కరించకపోతే 28న సీఎం, సీఎస్‌కు కార్యాచరణ లేఖ ఇస్తాం 

నవంబర్‌లో జిల్లా కలెక్టర్లకు కార్యాచరణ లేఖ.. భారీ ర్యాలీలు.. ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు 

జనవరిలో నల్లబ్యాడ్జీలతో విధులకు.. మౌన ప్రదర్శనలు,బైక్‌ ర్యాలీలు, మానవహారాలు 

జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై పది నెలలవుతున్నా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీ జేఏసీ) ఆవేదన వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వమని ఇన్నాళ్లూ వేచి చూశామని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రతి మంత్రి గడప తొక్కామని, తమ సమస్యలు సీఎం వద్దకు తీసుకెళ్లాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. 

తమ డిమాండ్లు దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అపాయింట్‌మెంట్‌ కోరుతున్నా ఇవ్వడం లేదని వాపోయింది. సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించింది. మంగళవారం టీఎన్జీవో కార్యాలయంలో టీజీ జేఏసీ (తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లతో కూడిన సంయుక్త కార్యాచరణ కమిటీ) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మొత్తం 51 డిమాండ్లు, అతి ముఖ్యమైన ఆరు డిమాండ్లకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు.  

డీఏలు, హెల్త్‌కార్డులు ఏమయ్యాయి? 
‘ఉద్యోగుల డిమాండ్లు, పెండింగ్‌ బిల్లులు, జీపీఎఫ్, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించాం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెల 26న జరిగే కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మంత్రివర్గ భేటీలో ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోకుంటే నిరసనలతో కూడిన కార్యాచరణతో ముందుకెళ్తాం. ప్రత్యేక తెలంగాణలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు నేడు తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తోంది. 

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఐదు డీఏలు ఇస్తామన్న హామీ ఏమైంది? జీపీఎఫ్‌లో ఉన్న డబ్బులను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పీఆర్సీ ముచ్చటే లేదు. ఉద్యోగుల భాగస్వామ్యంతో హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరినా దాని ఊసేలేదు. హెల్త్‌కార్డులు ఇస్తామని తెచ్చిన జీవో ఏమైందో చెప్పాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. 

రాష్ట్రంలో వరదలు వస్తే ఉద్యోగులమంతా ఏకమై ప్రభుత్వానికి (సీఎంఆర్‌ఎఫ్‌) రూ.130 కోట్లు ఇచ్చాం. అప్పుడు రెండురోజుల్లో సమావేశం పెడతామన్నారు. ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఉద్యోగులకు, ప్రభుత్వం కూడా అదే విధంగా ఉండాలి. జేఏసీ ఏ పారీ్టకీ కొమ్ముకాయదు. ఉద్యోగుల సమస్యలపై మాత్రమే పోరాటం ఉంటుంది..’ అని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 

సీఎం పేషీ ఉద్యోగులే సమస్యలపై ప్రశ్నిస్తున్నారు  
‘మా సమస్యలపై ఎక్కని గడప లేదు. సీఎం దగ్గరకు వెళదామంటే పేషీ అధికారులు అపాయింట్‌మెంట్‌ లేదని చెబతున్నారు. కానీ అక్కడి ఉద్యోగులే డీఏ ఏమైంది? హెల్త్‌కార్డులు ఏమయ్యాయి? అని అడుగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి కూర్చుని మాట్లాడితే మా సమస్యలు సగం వరకు పరిష్కారమవుతాయి. ఆయనపై విశ్వాసం ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు ఊరటనిచ్చారు. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టి మా పక్షాన నిలిచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. ప్రజా ప్రభుత్వంలో భాగం చేయాలి..’ అని జేఏసీ నేతలు కోరారు.   

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లివీ.. 
1. 2022 జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలు (డీఏ)లు వెంటనే విడుదల చేయాలి. బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి. 
2. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్‌ చేయాలి, ఇ–కుబేర్‌ వ్యవస్థను రద్దు చేయాలి. ట్రెజరీ విభాగం ద్వారా బిల్లులను క్లియర్‌ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలి.  
3. అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు/చర్చలు ఇప్పటికే పూర్తయినందున ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్‌మెంట్‌తో 2వ పీఆర్సీ సిఫార్సుల నివేదిక తెప్పించుకుని అమలు చేయాలి. 
4. ప్రభుత్వం, ఉద్యోగులు/ పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) అమలు చేయాలి. 
5. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌– యూపీఎస్‌ ) స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ ( ఓపీఎస్‌) పథకాన్ని పునరుద్ధరించాలి. 
6. జీవో–317 సమీక్షించాలి.317 జీవో బాధితులు కోరుకునే చోటకు బదిలీ చేయాలి. ఖాళీల లభ్యత కోసం అడగకుండా, వీలైనంత త్వరగా వెబ్‌సైట్‌ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలి. 

ఉద్యోగుల కార్యాచరణ ఇలా... 
– ఈ నెల 23 నుంచి 30 వరకు టీజీ జేఏసీ జిల్లా కమిటీల ఏర్పాటు  
– 28న సీఎం, సీఎస్‌లకు కార్యాచరణ లేఖ అందజేత 
– నవంబర్‌ 2న జేఏసీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో జిల్లా కలెక్టర్లకు కార్యాచరణ లేఖ అందజేత 
– 4, 5 తేదీల్లో ర్యాలీలతో జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులకు వినతిప్రతాల సమర్పణ 
– 6న టీజీ జేఏసీ కార్యవర్గ సమావేశం 
– 7 నుంచి డిసెంబర్‌ 27 వరకు ఉమ్మడి పది జిల్లాల్లో ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల సాధన సదస్సులు 
– జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు. భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన 
– 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మౌన ప్రదర్శనలు,  
– 23న రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు, 30న రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement