జగిత్యాల: తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు 40 రోజులపాటు చికిత్స అందించి.. ప్రాణాలు నిలిపారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. బతుకుతుందో లేదోనన్న బిడ్డ ఆరోగ్యంగా బయటికి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కథలాపూర్ మండలం తక్కళ్లపల్లికి చెందిన శ్రీలత డెలివరీకోసం మార్చి 29న కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. బ్లీడింగ్ అధికంగా కావడంతో అదేరోజు సిజేరియన్ చేయగా పాప జన్మించింది. ఏడో నెలలో పుట్టిన శిశువు కావడంతో 750 గ్రాముల బరువే ఉంది. శ్వాససంబంధ రుగ్మత, రక్తం ఇన్ఫెక్షన్, తీవ్ర రక్తహీనతతో ఉంది. బతుకుతుందా లేదా అనే ఆందోళన మొదలైంది. అయితే బంధువులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. పాపను వెంటనే పరీక్షించిన వైద్యులు.. కంటికి రెప్పలా కాపాడుతూ 40 రోజులపాటు వైద్యం అందించారు.
దీంతో శిశువు 1,100 గ్రాముల బరువుకు చేరడంతోపాటు, ఆరోగ్యంగా తయారైంది. దీంతో సోమవారం తల్లీబిడ్డను డిశ్చార్జి చేశారు. తమ పాపను కాపాడిన వైద్యులు, సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. శిశువుకు మెరుగైన చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని, జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్‌ఎంవో శశికాంత్‌రెడ్డి, ప్రొఫెసర్ అజామ్, డాక్టర్ స్నేహలత, నర్స్‌లు పాల్గొన్నారు.
చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి
Comments
Please login to add a commentAdd a comment