సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం చేయించు కునేందుకు మన రాష్ట్ర పేదలకు వెసులుబాటు కలగనుంది. దీని ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికొచ్చి వైద్యం పొంద డానికి అవకాశం ఏర్పడనుంది. కేంద్రం ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీ కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ పథకాలను అనుసంధానం ఎలా చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండింటినీ అమలు చేసేలా పథకాన్ని ఆధునీకరించే అవకాశముంది. ఆయుష్మాన్ పథకం రాష్ట్రంలో ప్రవేశపెట్టినా ఆరోగ్యశ్రీ పథకం కూడా దానితోపాటు అమలయ్యే అవకాశముంది. చదవండి: (రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్)
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో 77.19 లక్షల కుటుంబాలు అర్హులుగా ఉండగా, ఆయుష్మాన్ పథకంలోకి రాష్ట్రంలో 26.11 లక్షల కుటుంబాలు మాత్రమే వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆయుష్మాన్ భారత్ అమలుతో ఆరోగ్యశ్రీ పరిధిలో లేని దాదాపు 400కిపైగా చికిత్సలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ.780 కోట్ల మేరకు ఖర్చుచేస్తోంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా రూ.2 లక్షలు పరిమితి ఉండగా, కొన్ని జబ్బులకు రూ.18 లక్షల వరకూ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. 946 చికిత్సలను ఈ పథకం కింద పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.
ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు
ఆయుష్మాన్ భారత్‌లో ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకూ కేంద్రం ఖర్చు చేస్తుంది. 1,350 రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీలో లేనివి, ఆయుష్ వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకం పరిధిలోకి ఇటీవలే కరోనా చికిత్సలను చేర్చడంతో ఆయా బాధితులకు కొంతమేరకు ఊరటగా ఉంటుంది. ఆరోగ్యశ్రీలో కిడ్నీ, లివర్, బోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటివి చేయడంతోపాటు జీవితకాలం మందులు వంటివి కూడా ఇస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ, ఆయుష్మాన్ భారత్‌లో ఇటువంటి వసతులు లేవు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలైతే రాష్ట్రానికి దాదాపు రూ. 250 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్యాకేజీ ధరలు పెంచాలంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు
ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీ కంటే ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రులు అంటున్నాయి. అందువల్ల ప్యాకేజీ ధరలను పెంచకుండా చికిత్స చేయడం కష్టమని పేర్కొంటున్నాయి. వాస్తవంగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలనే పెంచాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను యథాతథంగా అమలు చేస్తూనే, కొత్త చికిత్సలకు ఆయుష్మాన్ భారత్ ధరలను పర్తింపజేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తుంది. అందుకు సంబంధించి త్వరలో ఉమ్మడిగా మార్గదర్శకాలను జారీ చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment