రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గొత్తికోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఎం మాజీ శాసనసభ పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివాసీలకు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఉన్నాయన్న విషయం తెలియకుండా శతాబ్దాలుగా అడవే జీవనా«ధారంగా జీవిస్తున్నారని తెలిపారు. గత రెండు, మూడు దశాబ్దాల నుంచి ఛతీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పక్కనే ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గొత్తికోయలు వలస వచ్చారన్నారు.
గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆదివాసీ అటవీహక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘గొత్తికోయలు – పోడుభూముల సమస్యలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ...దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయల జీవించే హక్కును కాలరాస్తూ వెళ్లగొట్టాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. వారు తెలంగాణ పౌరులు కాదని మంత్రి సత్యవతిరాథోడ్, అటవీఅధికారులు బహిరంగ ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు.
అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్యను బూచీగా చూపి వారికి పోడు భూములపై హక్కులు కల్పించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, గిరిజన సంఘం కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, రమణాల లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment