చికెన్ రైస్‌ను కొని తింటున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయెన్స్ శనివారం నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కంటే ముందే 2001లో ఏర్పడిన ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇంకా ఒడిదొడుకుల్లోనే ఉండగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటులో అభివృద్ధితో పాటు భారత ఆర్థిక పురోగతిలో కీలకంగా మారిందని చెప్పారు. విద్యుత్ కొరతను అధిగమించడంతో పాటు వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందేవరకు జరిగిన పరిణామాలను వివరించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటితో పాటు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి రంగంలో సాధించిన మార్పును గణాంకాలతో చెప్పారు.
ఐటీని పట్టణాలకు విస్తరిద్దాం: ప్రముఖ భారతీయ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని కేటీఆర్ సన్మానించి ఆయన సేవలను ప్రశంసించారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు పెట్టుబడులతో ముం దుకు రావాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. మన ఊరు–మన బడికి విరాళాలు ప్రకటించిన ప్రవాస భారతీయులను శాలువాలతో సత్కరించారు.
ఫైజర్, జాన్సన్, జీఎస్‌కే ప్రతినిధులతో భేటీ
ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) ప్రతినిధులతో కేటీఆర్ శనివారం భేటీ అయ్యారు. లైఫ్ సైన్సెస్‌కు సంబంధించి తెలంగాణలో ఉన్న అవకాశాలు, మానవ వనరులు, ఫార్మా పరిశోధనలకు అనుకూలతలపై కంపెనీలకు కేటీఆర్ వేర్వేరుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే 20వ బయో ఏషియా సదస్సుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులతో పాటు విస్తరణ ప్రణాళికను ఆయా కంపెనీలు కేటీఆర్‌తో పంచుకున్నాయి. సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు స్ప్రింక్లర్
సోషల్ మీడియా రంగంలో పేరొందిన అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ప్రింక్లర్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీనివల్ల వెయ్యి మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కంటెంట్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా రీసెర్చ్‌లో స్పి్రంక్లర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
న్యూయార్క్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్
విద్యార్థిగా, ఉద్యోగిగా తాను న్యూయార్క్‌లో గడిపిన రోజులను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో అడుగు పెట్టిన నాటి నుంచి తీరిక లేకుండా గడుపుతున్న కేటీఆర్.. శనివారం ఫైజర్ సీఈవోతో భేటీ తర్వాత న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తర్వాతి సమావేశానికి బయలుదేరారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్‌తో కూడిన చికెన్ రైస్‌ను కొని తిన్నారు. సమావేశానికి ఆలస్యం అవుతుండటంతో న్యూయార్క్‌లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment