ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోలో ఇదీ పరిస్థితి: 155 పోస్టులు .. 102 ఖాళీ!  | Telangana Large Number Of Posts Are Vacant In Fingerprint Bureau | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో: 155 పోస్టులు .. 102 ఖాళీ! 

Published Fri, Oct 1 2021 4:01 AM | Last Updated on Fri, Oct 1 2021 9:19 AM

Telangana Large Number Of Posts Are Vacant In Fingerprint Bureau - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు, డాక్యుమెంట్ల ఫోర్జరీ.. ఇలా ఏవిధమై న నేరాల్లోనైనా నిందితుల గుర్తింపునకు తొలి ఆయుధంగా ఉపకరించేది వేలిముద్రలే. ఆయా కేసుల్లో దర్యాప్తు అధికారులు ముందుకు సాగేందుకు నేరం జరిగిన ప్రదేశం (సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌) లో, ఇతర చోట్ల వేలిముద్రల (ఫింగర్‌ ప్రింట్స్‌) సేకరణే కీలకం. ఇంత ప్రాధాన్యత ఉన్న ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోలో అధిక సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం విస్మయం కలిగిస్తోంది.

ఒక్క ఇన్‌స్పెక్టర్‌ కూడా లేరు 
రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలో పనిచేసే స్టేట్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో (ఎస్‌ఎఫ్‌పీబీ)లో మొత్తం మంజూరు పోస్టులు 155 కాగా, ఇందులో 102 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో (సీఎఫ్‌పీబీ) తాజాగా వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సంస్థ డైరెక్టర్‌ పోస్టుతో పాటు ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టుల్లో మూడు, 39 ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు గాను 39 ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా మంజూరైన 77 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల్లో 26 భర్తీ కాగా, 51 ఖాళీగా ఉండగా, 33 అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల్లో 8 ఖాళీగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ పేర్కొంది.

భర్తీ చేస్తే మరింత జోష్‌తో... 
తక్కువ సిబ్బందితో ఒత్తిడికి గురవుతూ ఎలాగో నెట్టుకొస్తున్న రాష్ట్ర సంస్థ.. 2020 ఏడాదికి పెం డింగ్‌ కేసులు లేకుండా చేయడంతో పాటు అనేక కేసుల్లో సేకరించిన వేలిముద్రలను భద్రపరిచే పని కూడా చేస్తోంది. కేంద్ర బ్యూరో కలిసి డేటా అప్‌డేట్‌ నిర్వహిస్తోంది. ఇంతటి కీలకమైన సంస్థ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే నిందితుల గుర్తింపు మరింత త్వరగా జరుగుతుందని, కేసులను మరింత త్వరగా పరిష్కరించవచ్చని సంస్థ ఉన్నతాధికారులు అంటున్నారు. వరుసగా జరుగుతున్న పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈ ఖాళీలను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు.

అద్భుత పనితీరుతో కేసుల పరిష్కారం
సిబ్బంది తక్కువగా ఉన్నా వేలిముద్రల సేకరణ, వాటి విశ్లేషణలో మాత్రం తెలంగాణ ఎస్‌ఎఫ్‌పీబీ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు సీఎఫ్‌పీబీ రిపోర్టు స్పష్టం చేస్తోంది. గత 2020 ఏడాదికి సంబంధించి అద్బుతమైన రీతిలో కేసులు పరిష్కరించేందుకు దోహదపడినట్లు పేర్కొంది. నల్లగొండ జిల్లా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసును నాలుగు రోజుల్లోనే ఎస్‌ఎఫ్‌పీబీ సహాయంతో పోలీసులు ఛేదించినట్లు తెలిపింది.

అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచలో జరిగిన ఓ దొంగతనం కేసులో కూడా రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్‌ చేయడానికి రాష్ట్ర బ్యూరో దోహదపడింది. వికారాబాద్‌ జిల్లాలోని నవాబ్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన మరో ఇంటి దొంతనం కేసులోనూ ప్రతిభ చూపి వారంలోనే నిందితులను అరెస్ట్‌ చేసేలా తోడ్పాటు అందించింది. ఇలా ఎన్నో కేసులు ఛేదించడంలో ఎస్‌ఎఫ్‌పీబీ చురుకైన పాత్ర పోషించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement