సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలపై బీజేపీ దృష్టి సారించింది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగే రాష్ట్ర మినీ కోర్‌కమిటీ భేటీలో ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన రెండోరోజే ఈ సమావేశం ఉండటంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి.
రాష్ట్ర బీజేపీ చేపట్టిన ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ చివరి రోజున మంగళవారం 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించాలని నాయకత్వం ఆదేశించింది. అయితే పార్టీకి సంస్థాగతంగా కీలకమైన రోజునే రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించడం గమనార్హం.
మనకూ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు
తెలంగాణ రాజకీయాలను కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తాకుతాయా, ఒకవేళ ఆ దిశలోనే చర్యలుంటే అవి ఏ రూపంలో ఉంటాయన్న దానిపైనా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలపై విచారణ, దర్యాప్తు సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటే వాటి పర్యవసానాలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్బోధను రాష్ట్ర ముఖ్యనేతలకు నాయకత్వం చేయొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది కర్ణాటక, తెలంగాణసహా వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అమిత్‌షా ఢిల్లీ నుంచి పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికల తయారీలో అమిత్‌షా బిజీ షెడ్యూల్ కారణంగా ఢిల్లీలో ఈ భేటీని నిర్వహిస్తున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి.
సునీల్ బన్సల్ నివేదిక కీలకం
ఇప్పటికే వారంరోజులు రాష్ట్రంలో బసచేసిన ఆ పార్టీ సంస్థాగత ఇన్‌చార్జీ సునీల్ బన్సల్ స్ట్రీట్‌కార్నర్ మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి, నేతల పనితీరు ఎలా ఉంది, వాటికి ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, చక్కదిద్దుకోవాల్సిన అంశాలపై బన్సల్ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకునే ఈ భేటీలో అమిత్‌షా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.
భేటీకి సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీజాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయకార్యవర్గసభ్యులు మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి తదితరులు పాల్గొంటున్నట్టు పార్టీవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment