
సాక్షి,సూర్యాపేట: బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పరిధి మించి ప్రవర్తిస్తోందని, చట్టప్రకారం విచారణ జరగడం లేదని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి' మండిపడ్డారు. గురువారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళను రాత్రి వరకు విచారిస్తామంటే అది ముమ్మాటికీ వేధించడమే, రాజకీయ కక్ష సాధింపు చర్యేనని చెప్పారు. బీజేపీ పార్టీ నాయకుల ఆలోచనలు, స్టేట్‌మెంట్ ఆధారంగానే ఈడీ పనిచేస్తోందని, విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గు చేటని దుయ్యబట్టారు.
రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ పేరుతో కవితను వేధిస్తున్నారన్నారు. కవిత ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని చెప్పినా కూడా రాత్రి సమయం వరకు విచారించడం వేధించడమేనని జగదీశ్‌రెడ్డి అన్నారు. మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టి దేశాన్ని రక్షిస్తామన్నారు.