సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కేసీఆర్, టీ(బీ)ఆర్‌ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రతిపక్షాలను నిలదీశారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. భూపాలపల్లిలో గురువారం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్.. రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లను ఒక్కటే అడుగుతున్నా. తెలంగాణ రాకుంటే మీ ఇద్దరినీ ఎవరైనా పట్టించుకునేవాళ్లా? పార్టీలకు అధ్యక్షులు అయ్యేవాళ్లా? అని ప్రశ్నించారు కేటీఆర్.
‘ఓ పిచ్చోడు ప్రగతి భవన్ తేల్చేస్తామంటాడు. మరో పిచ్చోడు సెక్రెటేరియేట్‌ను పేల్చేస్తామంటాడు. అలాంటి పిచ్చోళ్ళ చేతుల్లో పార్టీలు ఉంటే.. రాష్ట్ర మొత్తానికి నష్టమే జరుగుతుంది. పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టద్దు’ అని సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నాడు. ఈ డెబ్భై ఏళ్లలో ఒక్కటి కాదు.. పది ఛాన్సులు ఇచ్చాం. మరి ఏం చేశారో చెప్పండి అంటూ తీవ్ర విమర్శలు చేశారాయన. అలాంటి దిక్కుమాలిన అసమర్థ పాలన మళ్లీ మనకు కావాలా? అని ప్రశ్నించారు కేటీఆర్.
బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే.. ఎమ్మెల్యే గండ్ర బజాప్తుగా కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లో చేరారు. రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోలేదా?. రాజస్థాన్‌లో కాంగ్రెస్ చేస్తే సంసారం.. ఇక్కడ బీఆర్‌ఎస్ చేస్తే వ్యభిచారమా? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు కేటీఆర్. ఇదెక్కడి నీతి? ఒక్కటే అడుగుతున్నా.. ఆలోచించుమని కోరుతున్నా. ప్రజల మనసు గెలవాలంటే అధికారంలోకి రావాలంటే.. ఏం చేసినమో చెప్పాలి. ఏం చేస్తామో చెప్పాలి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మనపై కక్షగట్టి శత్రుదేశంపై దాడి చేసినట్లు.. ప్రధాని మోదీ, బిజేపీ వేటకుక్కల్లా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అసమర్థ ప్రధానిని.. బలవంతంగా విశ్వగురువు.. విశ్వగురువు అంటున్నారు. ఢిల్లిలో ఉన్నోడు పేకుడు.. ఇక్కడున్నోడు జోకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ను నిర్మించిన ఘనత కేసీఆర్‌ది. ముమ్మాటికీ మాది కుటుంబ పాలనే. తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. మనది వసుదైక కుటుంబం.. కుల పిచ్చి మత పిచ్చి మాకు లేదు అని కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. అలాగే..
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 95% రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తున్నామని కేటీఆర్ ప్రస్తావించారు. సింగరేణిపై బీజేపీ కన్నుపడింది. సింగరేణిని ప్రైవేట్‌పరం కానివ్వం.. అవసరమైతే సకల జనుల సమ్మెకు సైతం సిద్ధమవుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా తమ దగ్గర అమలు చేయాలని కోరుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. నాలుగు కోట్ల ప్రజలకు లాభమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment