నల్లగొండ టూటౌన్: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్ విసిరారు. నల్లగొండ పట్టణంలో సోమవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో, ఆ తర్వాత విలేకరుల సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి ఓటమితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్నారు.
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచారని, టీఆర్‌ఎస్ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నందున బీజేపీ నాయకులు ప్రజల్లోనే ఉండి పోరాడితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు రాజకీయం చేసి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నాయన్నారు.
నిరసన తెలియజేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. రైల్వే ఆస్తుల్ని తగులబెడుతుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేశారని, నిఘా వ్యవస్థ ఎక్కడ పోయిందని నిలదీశారు. పోలీసు కాల్పుల్లో ఒక అభ్యర్థి మరణించడం బాధాకరమని, అతని అంతిమయాత్రలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాలు కట్టి ఇతరులను రానీయకుండా అడ్డుకోవడాన్ని శవరాజకీయంగా అభివర్ణించారు. ఆర్మీ అభ్యర్థులు బలిపశువులు కావద్దని, ఒకసారి కేసులు నమోదైతే ఉద్యోగాలు రావడం కష్టమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment