16వ తేదీన లీకైన మ్యాథ్స్ పేపర్స్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ శాతవాహన యూనిర్సిటీ: పరీక్షల నిర్వహణలో శాతవాహన యూనివర్సిటీ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా పరిగణించలేదు. దీనిపై ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కావడంతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. శనివారం మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. వాస్తవానికి ఈనెల 18న ఉదయం ఈ ఉదంతం వెలుగుచూడగానే.. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది.
కానీ నిబంధనల పేరు చెప్పి, కమిటీ వేసి దాని రిపోర్టు వచ్చేదాకా ఆగడంతో.. ఈ విషయాన్ని యూనివర్సిటీ చాలా తేలిగ్గా తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమానిత విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న తొమ్మిది మొబైల్స్‌ను శనివారం ఓపెన్ చేసిన కమిటీ సభ్యులు వాటిలో ఆధారాలు అప్పటికే డిలిట్ చేసి ఉండటంతో తెల్లమొహం వేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక.. తొలుత ఏసీపీ తుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాలేజీ సిబ్బంది పనే..
ఈ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత 18న నిర్వహించిన 6వ సెమిస్టర్ ఫిజిక్స్ పేపర్–2 లీకైందని అంతా అనుకున్నారు. ఈ వ్యవహారంలో ‘సాక్షి’పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా లీకైన పేపర్లను, వాటిని పోస్టు చేసిన విద్యార్థుల నంబర్లను మరిన్ని ‘సాక్షి’సంపాదించింది. అందులో 16న జరిగిన మ్యాథ్స్, 17న జరిగిన ఫిజిక్స్ పేపర్–1 కూడా లీకైనట్లు తేలింది. ఈ పేపర్లను కంప్యూటర్ నుంచి డౌన్‌లోడ్ చేయకముందే.. నేరుగా ఫొటోలు తీసి పంపారు.
ఉదయం 10 గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా.. 9.38 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష పత్రాన్ని మ.1.47 నిమిషాలకు వాట్సాప్‌లో షేర్ చేశారు. అయితే ఇది యూనివర్సిటీలో జరిగిందా? లేదా ఇతర కాలేజీలో జరిగిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వర్సిటీ అధికారులు ప్రైవేటు కాలేజీ సిబ్బంది చేసిన పనిగా అనుమానిస్తున్నారు. మరోవైపు శాతవాహన పరిధిలోని ప్రభుత్వ కాలేజీలోని సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై జిల్లాకు చెందిన ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నత విద్యా మండలికి శనివారం మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
విద్యామండలి సూచనల మేరకు చర్యలు: వీసీ ప్రొ.మల్లేశ్
పేపర్ లీక్‌కు సంబంధించి వేసిన విచారణ కమిటీ సిఫార్సుల మేరకు పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యామండలికి ఫిర్యాదు చేస్తాం. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment